మైక్రోసాఫ్ట్‌లోనూ కోత మొదలైంది

మైక్రోసాఫ్ట్‌లోనూ కోత మొదలైంది

ఆర్థిక మాంద్యం కారణంగా ఐటీ కంపెనీలు ఖర్చు తగ్గించుకునే పనిలో పడ్డాయి. అందులో భాగంగా ఉద్యోగులను తొలగించే ప్రక్రియను వేగవంతం చేశాయి. అదే తరహాలో ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కూడా స్టాఫ్ ను తీసివేసేందుకు సిద్దమైంది. నేడు వేలాది మందిని తీసివేయనున్నట్టు రాయిటర్స్ తెలిపింది. ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు ఇప్పటికే స్టాల్వార్ట్స్ సేల్స్‌ఫోర్స్, అమెజాన్ కంపెనీలు ఇటీవలే తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించాయి. పలు టెక్ కంపెనీలు సైతం తమ ఉద్యోగుల్లో 10 శాతం మందిని తొలగించాయి. అదే విధంగా మైక్రోసాఫ్ట్ కూడా తమ ఉద్యోగుల్లో 5 శాతం అంటే దాదాపు 11వేల మందిని తీసివేయనున్నట్టు సమాచారం.

ఇప్పటికే కాస్ట్ కట్టింగ్ లో భాగంగా మెటా, మైక్రోసాఫ్ట్‌ సంస్థలు ఆఫీసుల్ని ఖాళీ చేస్తున్నట్లు సీటెల్‌ టైమ్స్‌ కథనం ప్రచురించింది. ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ మెటా, మైక్రోసాఫ్ట్ కంపెనీలు వాషింగ్టన్‌లోని కార్యాలయ భవనాలను ఖాళీ చేసినట్లు చెప్పింది. టెక్ సెక్టార్‌లో మార్పులు, ఆఫీస్‌ మార్కెట్‌లో నెలకొన్న ఒడిదొడుకుల కారణంగా సీటెల్‌లోని అర్బోర్ బ్లాక్ 333లోని 6 అంతస్తులు, బెల్లేవ్‌లోని స్ప్రింగ్ డిస్ట్రిక్ట్‌ బ్లాక్ 6లోని 11అంతస్తులను లీజ్ కు ఇచ్చేందుకు మెటా ప్లాన్ చేస్తోంది.