ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన మిడ్​ డే మీల్స్ ​వర్కర్లు 

ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన మిడ్​ డే మీల్స్ ​వర్కర్లు 

ఖైరతాబాద్, వెలుగు: రూ. వెయ్యి  వేతనంతో ఇల్లు గడవడం కష్టంగా ఉందని, పెంచాలని డిమాండ్​ చేస్తూ మిడ్​ డే మీల్స్​వర్కర్లు శుక్రవారం ప్రగతిభవన్ ముట్టడికి యత్నించారు. ఈ సందర్భంగా ఆ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంతోష మాట్లాడుతూ.. 14 ఏండ్లుగా స్కూళ్లలో భోజనం వండిపెడుతున్న తమకు కేవలం వెయ్యి రూపాయల వేతనమే ఇస్తున్నారన్నారు. పెరిగిన ధరలతో ఆ వేతనం సరిపోవట్లేదని, కుటుంబం గడవడం కష్టంగా ఉందని వాపోయారు. బయట కూలి పనికి వెళ్తే రోజుకు 500 వస్తున్నాయని చెప్పారు. తమను లేబర్ యాక్ట్ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్​చేశారు. ఏడేళ్లుగా వేతనంలో ఒక్క రూపాయి  కూడా పెంచలేదని వాపోయారు. ఉద్యమంలో పాల్గొన్న తమకు సొంత రాష్ట్ర ఫలాలు అందట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ ​స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 52 వేల మంది కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కనీస వేతనం రూ.10,500 చెల్లించాలని డిమాండ్​ చేశారు. ఉద్యోగ భద్రతతోపాటు ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయం కల్పించాలని కోరారు. స్పందించకుంటే రానున్న రోజుల్లో తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. ముట్టడిలో వివిధ జిల్లాల నుంచి 60 మందికి పైగా కార్మికులు పాల్గొన్నారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి ఎస్సార్ నగర్, పంజాగుట్ట పోలీసు స్టేషన్ లకు తరలించారు.