నీటి కేటాయింపుల్లో తీరని అన్యాయం.. జలాల పంపిణీ, వైఫల్యాలపై రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు

నీటి కేటాయింపుల్లో తీరని అన్యాయం.. జలాల పంపిణీ, వైఫల్యాలపై రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
  • రాష్ట్రంలో 69% కృష్ణా పరీవాహకం ఉన్నా... వాడుకుంటున్నది 299 టీఎంసీలే
  • 31% పరీవాహకం ఉన్న ఏపీ మాత్రం 700 టీఎంసీలు గుంజుకపోతోంది
  • నీటి పంపకాలపై సమగ్ర పాలసీ రూపొందించడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ విఫలం
  • జలాల పంపిణీ, వైఫల్యాలపై రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పన్నెండేండ్లు గడుస్తున్నా కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయమైన వాటా పొందడంలో పాలకులు ఘోరంగా విఫలమయ్యారని పలువురు మేధావులు, రిటైర్డ్ ఇంజినీర్లు మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో జల ప్రదర్శన జరిగిందే తప్ప, నిజమైన సాగునీటి ప్రగతి జరగలేదని విమర్శించారు. 

సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ‘‘పన్నెండేండ్ల తెలంగాణలోనూ కృష్ణా, గోదావరి జలాలలో న్యాయమైన వాటా... పొందడంలో విఫలం – కారణాలు, పాలమూరు, డిండికి అన్యాయం చేసింది ఎవరు?’’ అనే అంశంపై.. రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జస్టిస్ చంద్రకుమార్, రాఘవాచారి, ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ ఇంజినీర్ దొంతుల లక్ష్మీనారాయణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నీటి లెక్కలను వివరించారు.

పాలమూరు గోల్డెన్ టైమ్​ను కేసీఆర్ వృథా... 

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన అమూల్యమైన సమయాన్ని కేసీఆర్ వృథా చేశారని వక్తలు అభిప్రాయపడ్డారు. పాలమూరు పనులను పక్కనపెట్టి.. కాళేశ్వరం వైపు పరుగులు పెట్టారని విమర్శించారు. ఇదే సమయంలో ఏపీలో చంద్రబాబు పట్టిసీమను పూర్తి చేసి 170 టీఎంసీల గోదావరి నీళ్లను కృష్ణా డెల్టాకు మళ్లించుకున్నారని, జగన్ వచ్చాక పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుకున్నారని గుర్తుచేశారు. జూరాల నుంచి చేపట్టాల్సిన పాలమూరును శ్రీశైలం నుంచి చేపట్టడం వల్ల కల్వకుర్తి ఆయకట్టుకు నష్టం జరిగిందన్నారు.

సీబీఐ ఎంక్వైరీ ఓ డ్రామా: జస్టిస్ చంద్రకుమార్

కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా మారడం వల్ల రాష్ట్ర ప్రజల సొమ్ము రూ. 50 వేలకోట్ల నుంచి రూ. 60 వేల కోట్లు వృథా అయ్యాయని జస్టిస్ చంద్రకుమార్ ధ్వజమెత్తారు. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకునే అధికారం సీఎం రేవంత్ రెడ్డికి ఉన్నప్పటికీ..  కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డిని కాపాడేందుకే కేసును సీబీఐకి అప్పగించే డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి వందల కోట్లు ఇచ్చిన మేఘా కృష్ణారెడ్డిని కేంద్రం కాపాడుతుందని తెలిసే రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. 

తెలంగాణకు వాటర్ పాలసీ ఏది?: రాఘవాచారి

తెలంగాణకు స్పష్టమైన జల విధానం లేకపోవడం సిగ్గుచేటని రాఘవాచారి అన్నారు. ఏపీలో ఇంజినీర్లు ప్రతి నీటి చుక్కను లెక్కగడుతుంటే, తెలంగాణలో మాత్రం ఆ పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ ప్రదర్శనలకే పరిమితమయ్యారని, ఆయన హయాంలో జలవనరుల పంపిణీలో ప్రాంతాల వారీగా తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు. జూరాల నుంచి పాలమూరు చేపడితే.. డిండి ఆయకట్టు కూడా నీళ్లు అందుతాయనన్నారు. పాలమూరు జిల్లాలో ప్రాజెక్టుల భూసేకరణ వల్ల 30 గ్రామాల్లో ప్రజలు భూములు కోల్పోయారని, మనస్తాపంతో 150 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పాశం యాదగిరి తెలిపారు. 

మనకు సరైన జల విధానం లేదు: వినాయక్ రెడ్డి

రాష్ట్రం ఏర్పడి పదేండ్లు దాటినా...  సరైన జల విధానం లేదని ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి అన్నారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును 2015 లో ప్రారంభిస్తే.. 2022 వరకూ డీపీఆర్లు పంపలేదని, దీనికి నికర జలాలు 45 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని, ఇంకా 45 టీఎంసీల సర్ ప్లస్ నీళ్లను చూపించమంటే.. అంతకు ముందు జిల్లాల వారీగా, మండలాల వారీగా చూయించారని, దానికి కేంద్రం ఒప్పుకోలేదని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో జల వనరుల నిపుణులు వెదిరే శ్రీరామ్ చెప్పారని వెల్లడించారు. జూరాల నుంచి కాకుండా శ్రీశైలం నుంచి పాలమూరు చేపట్టడమే తప్పని వినాయక్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

కృష్ణా బేసిన్​లో తీరని అన్యాయం

కృష్ణా నదిలో 69 శాతం పరివాహక ప్రాంతం తెలంగాణలో ఉన్నా...  మనకు కేవలం 299 టీఎంసీల నీళ్లే దక్కుతున్నాయని, వాటిలోనూ పూర్తిగా వాడుకోలేక పోతున్నామని దొంతుల లక్ష్మీనారాయణ తెలిపారు. కేవలం 31 శాతం పరివాహకం ఉన్న ఏపీ, 512 టీఎంసీల కేటాయింపులు ఉన్నప్పటికీ.. ఏకంగా 600 నుంచి 700 టీఎంసీల నీళ్లను గుంజుకుపోతోందని లెక్కలతో సహా వివరించారు. 

గోదావరిలో తెలంగాణకు 968 టీఎంసీల వాటా ఉన్నా, ఇప్పటివరకు మనం 433 టీఎంసీలు మాత్రమే వాడుకుంటున్నామని తెలిపారు. నల్గొండ జిల్లాకు జీవధార అయిన ఎస్ఎల్ బీసీ టన్నెల్ పనులను కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. 2008 నుంచి 2014 మధ్య 23 కిలోమీటర్ల టన్నెల్ పూర్తికాగా..  గత పదండ్లలో పది కిలోమీటర్లు కూడా తవ్వలేదని మండిపడ్డారు. దీనివల్ల ఏటా రూ. 1200 కోట్ల విలువైన 40 టీఎంసీల నీళ్లను రాష్ట్రం కోల్పోతోందని చెప్పారు.