- కొత్త ఆవాసాలు, తోడు కోసం వస్తున్నాయంటున్న ఆఫీసర్లు
- మొన్న బెల్లంపల్లి, భూపాలపల్లిలో పులి సంచారం
- నిన్న కరీంనగర్, ములుగు జిల్లాల్లో కనిపించిన పులులు
- భయాందోళనలో అటవీ ప్రాంతాల ప్రజలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పులుల సంచారం ఎక్కువైంది. ఓ వైపు మహారాష్ట్రలోని తాడోబా నుంచి, మరో వైపు నల్లమల నుంచి టైగర్లు కొత్త ఆవాసాలను వెతుక్కుంటూ పలు జిల్లాల్లో తిరుగుతున్నాయి. తాడోబాలో పులుల సంతతి పెరిగిపోవడం.. అంతర్గత సంఘర్షణల వల్లే పులులు గోదావరి దాటి ఆసిఫాబాద్ జిల్లాలోకి అడుగుపెడుతున్నాయని, అక్కడి నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ మీదుగా జిల్లాల్లోకి ప్రవేశిస్తున్నాయని ఫారెస్ట్ ఆఫీసర్లు చెబుతున్నారు.
పులుల సంచారం పెరగడంతో ఫారెస్ట్ ఆఫీసర్లు అలర్ట్ అయ్యారు. స్థానికులు, వేటగాళ్ల నుంచి ముప్పు పొంచి ఉండడంతో ప్రత్యేక బృందాల ద్వారా గస్తీ కాస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 36 నుంచి 45 వరకు పులులు ఉన్నాయని చెబుతున్నారు. పులులు సంచరిస్తున్న అటవీ ప్రాంతాల్లో ఎలాంటి ఉచ్చులు బిగించకూడదని, పులి కదలికలు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
తాడోబా టు తెలంగాణ..
మహారాష్ట్రలోని తాడోబా టైగర్ రిజర్వ్ నుంచి పులులు తెలంగాణ వైపు క్యూ కడుతున్నాయి. అక్కడి టైగర్ రిజర్వ్‌లో పులుల సంఖ్య గణనీయంగా పెరిగిపోవడంతో కొత్త ఆవాసాలను వెతుక్కుంటూ ప్రాణహిత నది దాటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశిస్తున్నాయి.
ఈ సీజన్‌లో తాడోబా నుంచి సుమారు 3-4 పులులు రాష్ట్రంలోకి ప్రవేశించాయని, దీంతో కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ అటవీ ప్రాంతాలు ఇప్పుడు ‘టైగర్ జోన్’గా మారిపోయిందని చెప్తున్నారు. కాగా ఈ పులుల్లో కొన్ని వెనక్కి వెళ్లిపోతుండగా, మరికొన్ని తిర్యాణి, పెంచికల్‌పేట రేంజ్‌లలో ఆవాసం కోసం ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంటున్నారు.
సిద్దిపేట జిల్లాలోకి మొదటిసారి ఎంట్రీ
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోకి వస్తున్న పులులు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఇటీవల ఆసిఫాబాద్ నుంచి మొదలైన ఓ టైగర్ జర్నీ మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల మీదుగా సాగి సిద్దిపేట జిల్లాలోకి చేరింది.
తొగుట, మిరుదొడ్డి, కొండాపూర్ మండలాల్లో పులి పాదముద్రలు కనిపించాయని, సిద్దిపేట పట్టణానికి దగ్గరగా కూడా వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. సిద్దిపేట జిల్లాలో పులి కనిపించడం ఇదే తొలిసారి. కొత్త ఆవాసం కోసమో.. తోడు కోసమో ఈ పులి దాదాపు 300 కిలోమీటర్లకుపైగా నడిచి ఉంటుందని ఆఫీసర్లు భావిస్తున్నారు.
ఈ పులి రాష్ట్రంలోని 14 జిల్లాలో సంచరిస్తున్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. తాజాగా భూపాలపల్లి జిల్లాలోనూ పులి సంచారం కలవరపెడుతోంది. మహారాష్ట్ర లేదా ఛత్తీస్‌గఢ్ నుంచి ఓ పులి గోదావరి దాటి వచ్చినట్టు అనుమానిస్తున్నారు. ఇటీవల భూపాలపల్లి అడవి నుంచి జకారం వద్ద రోడ్డు దాటుతుండగా ఓ అంబులెన్స్ డ్రైవర్ చూసినట్టు స్థానికులు చెబుతున్నారు. ములుగు,అబ్బాపూర్, జాకారం, పందికుంట బీట్లలో పులి పాదముద్రలను గుర్తించారు.
సోమశిల వద్ద సంచారం
సోమశిల పరిధిలో ఓ పులి సంచారంతో యంగంపల్లితండా దాని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. నాగార్జునసాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వ్ వైపు నుంచి కృష్ణా నదిని ఈదుకుంటూ వచ్చిన ఓ పెద్దపులి తమ ప్రాంతంలో సంచరిస్తోందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. గ్రామస్తుల సమాచారంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టగా.. ఈ నెల17న వ్యవసాయ పొలాల్లో పులి పాదముద్రలు కనిపించాయి.
సాధారణంగా వేసవి కాలంలో పులులు రిజర్వ్ ఫారెస్ట్ వైపు నుంచి అమ్రాబాద్ వైపు సంగమేశ్వర ప్రాంతం గుండా నదిని దాటుతుంటాయి. రెండు రాష్ట్రాల సరిహద్దులు దగ్గరగా ఉండటం, అక్కడ నీటి లోతు తక్కువగా ఉండడంతో పులులు కొల్లాపూర్ ఫారెస్ట్ లిమిట్స్‌లోని మార్గాన్ని ఎంచుకుంటాయని ఆఫీసర్లు చెబుతున్నారు.
సవాల్‌గా మారిన పెద్ద పులుల రక్షణ
గతంలో మహారాష్ట్ర నుంచి వచ్చే ఒకటో రెండో పులులను కాపాడేందుకే అష్టకష్టాలు పడ్డ ఫారెస్ట్ ఆఫీసర్లకు ఇప్పుడు పెద్దసంఖ్యలో వస్తున్న పులులను రక్షించడం పెను సవాల్‌గా మారింది. టైగర్ కారిడార్‌లోని అడవుల్లో ఇటీవలి కాలంలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి పులులను ట్రాక్ చేస్తున్నారు.
వాటి కదలికలను నిత్యం గమనించేందుకు టైగర్ ట్రాకర్లను సైతం నియమించారు. అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా వేటగాళ్ల రూపంలో పెద్దపులులు ప్రాణాలు కోల్పోతున్నాయి. 2016లో మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పిన్నారం అడవుల్లో వేటగాళ్ల ఉచ్చుకు మగపులి బలైంది.
2018లో తిప్పేశ్వర్ నుంచి ఆదిలాబాద్, కవ్వాల్ మీదుగా జైపూర్ మండలం శివ్వారం ఫారెస్ట్‌లోకి ప్రవేశించిన టైగర్‌ను కరెంట్‌షాక్‌తో చంపిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. 2014 జనవరిలో కాగజ్‌నగర్ ఫారెస్ట్ రేంజ్‌లోని దరిగాం సమీపంలో కే4, కే15 అనే రెండు పులులు స్థానికుల విషప్రయోగానికి బలయ్యాయి.
ఈ ఏడాది కాగజ్‌నగర్ డివిజన్ పెంచికల్‌పేట రేంజ్‌లోని నల్లకుంట అటవీ ప్రాంతంలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ఓ పులి చనిపోయింది. అనంతరం దాని చర్మం, గోళ్లు, పండ్లను ఎత్తుకెళ్లారు. దీంతో అలర్ట్ అయిన ఫారెస్ట్ ఆఫీసర్లు ప్రత్యేక టీమ్స్‌ను ఏర్పాటు చేసి 24 గంటల పాటు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.
కరీంనగర్ జిల్లాలో పులి కలకలం
కరీంనగర్ రూరల్ మండలం బహదూర్‌ఖాన్‌పేట, చామన్‌పేట శివారులో మంగళవారం పులి సంచారం కలకలం రేపింది. గ్రామానికి చెందిన రైతు గుర్రం భూంరెడ్డి మంగళవారం ఉదయం పొలం వద్దకు వెళ్లగా.. ఒడ్డుపై జంతువు అడుగులు కనిపించాయి. దీంతో పోలీసులు, ఫారెస్ట్ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చాడు. అటవీశాఖ అధికారులు పొలం వద్దకు చేరుకొని అడుగుల గుర్తులు పులివేనని నిర్ధారించారు.
బహదూర్‌ఖాన్‌పేటలోని ఓ మామిడితోటలో సైతం పులి అడుగులను గుర్తించారు. పులి సంచారంతో చామన్‌పల్లి, వెదురుగట్ట, చర్లబూత్కుర్, కొండాపూర్, ఐతరాజుపల్లి గ్రామాల ప్రజలు రాత్రి వేళ బయట తిరగొద్దని ఫారెస్ట్ ఆఫీసర్లు హెచ్చరించారు. కాగా, కరీంనగర్ రూరల్ మండలంలో పులి సంచారం విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్.. జిల్లా అటవీ శాఖ అధికారి బాలమణితో ఫోన్‌లో మాట్లాడారు. రైతులు, స్థానికులకు అవసరమైన జాగ్రత్తలు చెప్పాలని సూచించారు.
ములుగు జిల్లాలో..
ములుగు జిల్లా ప్రజలను పెద్ద పులులు కలవరపెడుతున్నాయి. రెండు రోజుల కింద మగ పులి, తాజాగా ఆడ పులి సంచారంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని అబ్బాపూర్ శివారు పంట పొలాల్లో పులి పాదముద్రలు గుర్తించినట్లు ఆఫీసర్లు తెలిపారు.
ఆదివారం రాత్రి వచ్చిన మగపులి పందికుంట రేంజ్‌నుంతి సర్వీపూర్ మీదుగా వైల్డ్ లైఫ్ అటవీ ప్రాంతంలోకి వెళ్లిందని, సోమవారం వచ్చింది ఆడ పులి అని రేంజ్ ఆఫీసర్ డోలి శంకర్ తెలిపారు. పులుల సంచారంతో ములుగు, జాకారం, అబ్బాపూర్, పందికుంట గ్రామాల ప్రజలు, రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
