శంషాబాద్ ORRపై కుర్రకారు వీరంగం.. కార్ల డోర్లపై కూర్చొని డేంజర్ స్టంట్స్!

శంషాబాద్ ORRపై  కుర్రకారు వీరంగం.. కార్ల డోర్లపై కూర్చొని డేంజర్ స్టంట్స్!

శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కుర్రకారు వీరంగం సృష్టించారు. అతివేగంతో  ఓఆర్ఆర్ (ORR) రోడ్డుపై కొందరు ఆకతాయి యువకులు  రేసింగ్‌కు దిగారు. జూన్ 5న అర్ధరాత్రి శంషాబాద్ ఓఆర్ఆర్ మీద ఈ యువకులు రెచ్చిపోయారు. ట్రాఫిక్ రూల్స్  ను  గాల్లోకి వదిలేసి, నడిచే కార్ల డోర్లపై కూర్చొని అత్యంత ప్రమాదకరమైన రీతిలో విన్యాసాలు చేశారు. ఏ మాత్రం పట్టుతప్పినా ప్రాణాలు గాల్లో కలవడం ఖాయమని తెలిసినా... నిర్లక్ష్యంగా, నిర్భయంగా కార్ రేసింగ్‌లు చేస్తూ ఇతరుల ప్రాణాలతో కూడా చెలగాటమాడారు.

క్షణ కాలపు సరదా కోసం వీరు చేసిన ఈ డేంజర్ స్టంట్స్, కార్ రేసింగ్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఈ వీడియోలను చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత రద్దీగా ఉండే ఓఆర్ఆర్, ఇలాంటి ఆకతాయిల వల్ల రాను రాను డేంజర్ జోన్ గా మారుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

కేవలం రీల్స్ కోసమో, సోషల్ మీడియాలో లైకుల కోసమో ఇలా రోడ్లపై వీరంగం సృష్టిస్తూ... తమ ప్రాణాలనే కాదు, ఎదుటివారి ప్రాణాలను సైతం ప్రమాదంలో పడేస్తున్న ఇలాంటి కేటుగాళ్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.