అత్తాపూర్ లో అర్ధరాత్రి కిడ్నాప్ కలకలం..యువతిని బలవంతంగా ఎత్తుకెళ్లిన నలుగురు యువకులు!

అత్తాపూర్ లో అర్ధరాత్రి కిడ్నాప్ కలకలం..యువతిని బలవంతంగా ఎత్తుకెళ్లిన నలుగురు యువకులు!

రంగారెడ్డి: రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్ లో అర్థరాత్రి యువతి కిడ్నాప్ కలకలం రేపింది. ఓ యువతిని నలుగురు యువకులు బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. స్థానికులు సమచారంతో  పోలీసులు కారును వెంబడించినా ఫలితం లేకుండా పోయింది. పోలీసుల కళ్లు గప్పి కిడ్నాపర్లు తప్పించుకున్నారు. యువతి ఎవరు అనేది ఇంకా తెలిసిరాలేదు. యువతికోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. 

మంగళవారం (మే19) అర్థరాత్రి అత్తాపూర్ లో ఓ యువతి కిడ్నాప్ జరిగింది.థార్ కారులో వచ్చిన నలుగురు యువకులు ఆ యువతిని బలవంతంగా ఎక్కించుకొని వెళ్తుండగా స్థానికులు గమనించి 100 ఫోన్ చేసి పోలీసులు సమాచారం అందించారు.రంగంలోకి దిగిన పోలీసులు థార్ కారును అత్తాపూర్ నుంచి ఆరాంఘర చౌరస్తా వరకు వెంబడించారు. అయితే దుండగులు పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నారు. కిడ్నాప్ కు వాడిన థార్ కారుకు నంబర్ ప్లేట్ లేకపోవడంతో వివరాలు సేకరించడం కష్టంగా మారింది. సీసీఫుటేజ్ పరిశీలించిన పోలీసులు కిడ్నాపర్లకోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

యువతి కిడ్నాప్ కు గురైందా?.. వేరే కారణం ఏమైనా ఉందా అనే కోణంతో దర్యాప్తు చేపట్టారు అత్తాపూర్ పోలీసులు. తెల్లవారు జామున మూడు గంటల వరకు పోలీసులు దర్యాప్తు కొనసాగించారు.  యువతి కిడ్నాప్ గురైనట్లు గా ఇప్పటి వరకు ఎటువంటి ఫిర్యాదు అందకపోవడంతో ఆ యువతి ఎవరన్నది ఇంకా వివరాలు తెలిసిరాలేదని పోలీసులు చెప్పారు.