మళ్లీ సిటీ బాటపట్టిన వలస కూలీలు

మళ్లీ సిటీ బాటపట్టిన వలస కూలీలు

ఇప్పటికే 66 శాతం మంది చేరుకున్నరు
మరింత మంది తయారుగున్నరు
ఊళ్లలోనూ ఏ పనీ లేకపోవడంతో సిటీ బాట
తిండి సరుకులు తగ్గించుకున్న మరో 55 శాతం ఫ్యామిలీలు
పలు సంస్థల స్టడీలో వెల్లడి

న్యూఢిల్లీ: కరోనా లాక్డౌన్తో సిటీలు విడిచి పెట్టి వెళ్లిన వలస కూలీలు… అన్నీ ఓపెన్ అవుతుండడంతో ఇప్పుడిప్పుడే మళ్లీసిటీ బాట పడుతున్నారు. ఇన్నాళ్లూ పనుల్లేక.. పైసలు రాక.. ఇబ్బంది పడిన బడుగుజీవులు.. ఊళ్లోనూ ఏ పని దొరక్క మళ్లీపొట్టచేతబట్టుకుని పని కోసం సిటీలకు వచ్చేస్తున్నారు. ఇప్పటికే మూడింట రెండొంతుల (66 %) మంది సిటీలకు వచ్చేశారు. మరింత మంది వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆగా ఖాన్రూరల్ సపోర్ట్ప్రోగ్రామ్ (ఇండియా), యాక్షన్ ఫర్ సోషల్ అడ్వాన్స్మెంట్, గ్రామీణ్ సహారా, ఐ సాక్షమ్, ప్రదాన్, సాథి అప్, సేస్టా, సేవా మందిర్, ట్రాన్స్ఫార్స్ రూరల్ఇండియా ఫౌండేషన్ కలిసి చేసిన సర్వేలో ఈ విషయం తేలింది. 11 రాష్ట్రాల్లోని 48 జిల్లాల్లో 4,835 కుటుంబాలపై జూన్ 24 నుంచి జులై 8 వరకు ఆయా సంస్థలు సర్వే చేశాయి.

పిల్లను స్కూల్కు పంపరట..
ఇప్పటికే కరోనా కూలీల బతుకుపై కొట్టింది. దీంతో 24 శాతం కుటుంబాలు తమ పిల్లలను స్కూ లుకు పంపించబోమని, స్కూల్ నుంచి తప్పిస్తామని చెబుతున్నాయి. 43 శాతం కుటుంబాలకు సరిగ్గా తిండి కూడా దొరకట్లేదని సర్వే తేల్చింది. 55 శాతం మంది తినే తిండిలోని ఐటెమ్స్ను తగ్గించాయి. లాక్డౌన్ టైంలో రేషన్ ద్వారా ఇచ్చిన సరుకులు నిరుపేదలను ఎంతో ఆదుకున్నాయని స్టడీ పేర్కొంది. ఇల్లుగడవడం కోసం 6 శాతం కుటుంబాలు ఇంట్లోని వస్తువులను తాకట్టుపెట్టాయి. 15 శాతం మంది పశుసంపదను అమ్మేసుకున్నారు. పాడి పశువులను అమ్ముకున్నట్టు2 శాతం కుటుంబాలు చెప్పాయి. ఇంకో 2 శాతం కుటుంబాలు పూటగడవడం కోసం ఇళ్లు, భూములను తాకట్టుపెట్టాయి. 10
శాతం కుటుంబాలు బంధువుల నుంచి అప్పు తీసుకున్నాయి. 7 శాతం మంది అప్పులోళ్ల దగ్గర అప్పు తెచ్చుకున్నారు. లాక్డౌన్టైంలో మగవాళ్ల కన్నా ఆడవాళ్లపైనే ఎక్కువ ప్రభావం పడిందని స్టడీ తేల్చింది. లాక్డౌన్ టైంలో 80 శాతం కుటుంబాలు ప్రధాన మంత్రి ఉజ్వల పథకం కింద ఫ్రీగా గ్యాస్ సిలిండర్ను పొందారని స్టడీ పేర్కొంది.

ఊళ్లలో పనులు దొరకట్లే
లాక్డౌన్లో సిటీలు విడిచి పల్లెకు వచ్చేసిన మైగ్రెంట్లలో 29 శాతం మంది ఇప్పటికే సిటీలకు మళ్లీవచ్చారని సర్వేలో తేలింది. ఇంకో 45 శాతం మంది సిటీలకు వెళ్లేందుకు సిద్ధమన్నారు. పల్లెలకు వెళ్లిన చాలా మంది కూలీలుగానే సెటిల్ అయ్యారని, 80 శాతం మంది వాళ్లేనని సర్వే చెప్పింది. గ్రామాల్లో స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్కు కొరత ఉందని పేర్కొంది. ఇప్పటికీ 25 శాతం మంది దాకా గ్రామాల్లో పనుల కోసం వెతుక్కుంటున్నారని చెప్పింది. దీంతో మొత్తంగా 66 శాతం మంది దాకా మళ్లీ సిటీల బాట పట్టడమో లేదా వెళ్లేందుకు సిద్ధమవుతుండడమో జరుగుతోందని సర్వే వివరించింది.