300 మీటర్ల పై నుంచి పడ్డ జేసీబీలు .. ఇద్దరు ఆపరేటర్ల దుర్మరణం

 300 మీటర్ల పై నుంచి పడ్డ జేసీబీలు .. ఇద్దరు ఆపరేటర్ల దుర్మరణం
  • గపై నుంచి బండరాళ్లు పడడంతో నుజ్జునుజ్జయిన వాహనాలు
  • మృతులది బిహార్, ఒడిశా  
  • ములుగు జిల్లా మల్లంపల్లి క్రషర్‌లో ప్రమాదం

ములుగు, వెలుగు: ములుగు జిల్లా మల్లంపల్లి క్రషర్​లో ఆదివారం జరిగిన ప్రమాదంలో ఒడిశా, బిహార్​కు చెందిన ఇద్దరు వలస కూలీలు చనిపోయారు. దీపావళి పండుగ రోజు 300 మీటర్ల ఎత్తులో ఉన్న గుట్టపై రెండు ఎక్స్​కవేటర్లతో చదును చేస్తుండగా ఓ బండరాయి కుంగడంతో రెండు వాహనాలు కిందపడ్డాయి. వాటిపై పెద్ద పెద్ద బండరాళ్లు కూలడంతో నుజ్జునుజ్జుయి అందులోని ఇద్దరు ఆపరేటర్లు అక్కడికక్కడే చనిపోయారు.

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..మహ్మద్ ​గౌస్​పల్లిలోని సహ్యాద్రి స్టోన్​ క్రషర్ లో బిహార్​లోని బక్సర్​ జిల్లాకు చెందిన పరమేశ్వర్​ యాదవ్​(42), ఒడిశా రాష్ట్రం రాయఘడ్​ జిల్లాకు చెందిన జక్తు మజి(35) ఇటాచీ వెహికల్​ఆపరేటర్లుగా పని చేస్తున్నారు. ఆదివారం దీపావళి పండుగ సందర్బంగా యజమాని ఆదేశాల మేరకు గుట్టపై ఉదయం 10 గంటల సమయంలో రాళ్లను తొలగిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఓ బండ కుంగడంతో రెండు 300 మీటర్ల ఎత్తు నుంచి వాహనాలు కిందపడ్డాయి.

వారిపై పెద్దపెద్ద బండరాళ్లు పడడంతో నుజ్జునుజ్జయి ఆపరేటర్లు ఇద్దరూ మృతి చెందారు. తోటి కూలీల సాయంతో రాళ్లను తొలగించి కింద ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీశారు. సీఐ రంజిత్ కుమార్​, ఎస్సై వెంకటేశ్వర్​ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్వారీ సూపర్​వైజర్​ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, దీపావళి పండుగ రోజు, ఆదివారమైనా క్రషర్​ యజమాని కార్మికులతో పనులు చేయించడాన్ని మైనింగ్, కార్మిక శాఖ అధికారులు సీరియస్​గా తీసుకున్నారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.