ఓటేసేందుకు వలస కూలీలు వచ్చేశారు!

ఓటేసేందుకు వలస కూలీలు వచ్చేశారు!
  • పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో సందడిగా గ్రామాలు    
  • రెండు రోజులుగా తండాల్లో జోరుగా దావత్​లు
  • ఓట్లు కొల్లగొట్టేందుకు రాజకీయ పార్టీల లీడర్లు ప్రయత్నాలు
  • ఎక్కువ మంది ఓటర్లు ఇంటికి ఫ్యామిలీ ప్యాకేజీలు ఆఫర్​
  • దారి ఖర్చులూ ఇస్తున్నరు

మహబూబ్​నగర్, వెలుగు: ఉపాధి కోసం వలసపోయిన ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ  జిల్లా వాసులు ఓట్ల కోసం సొంతూళ్లకు తిరిగొచ్చారు. మంగళవారం నుంచి వీరి రాక మొదలు కాగా, బుధవారం రాత్రికి దాదాపు అంతా చేరుకున్నారు. హన్వాడ, కోయిల్​కొండ, గండీడ్, మహమ్మదాబాద్, దేవరకద్ర, మక్తల్, తాండూరు, పరిగి, పాలమూరు, బొంరాస్​పేట, కోస్గి, నారాయణపేట, దౌల్తాబాద్, మద్దూరు, కొడంగల్, బాలానగర్, కుల్కచర్ల​ మండలాలకు చెందిన దాదాపు 3 లక్షల మంది కూలీలు పొట్టకూటి కోసం మహారాష్ట్రలోని ముంబై, షోలాపూర్, పుణె, భీవండి, కర్ణాటకలోని వివిధ ప్రాంతాలకు వలస పోయారు. మూడు జిల్లాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్లలో వీరి ఓట్లు కీలకం. గంపగుత్తగా వీరి ఓట్లు పొందేందుకు ప్రధాన పార్టీల లీడర్లు అన్ని ప్రయత్నాలు చేశారు. మహారాష్ట్ర, కర్ణాటకలోని కూలీలు ఉండే ప్రాంతాలకు వెళ్లి ఆత్మీయ సమ్మేళనాలు పెట్టారు. ఓటుకు ఇంత ఇస్తామని, ఎక్కువ మంది ఉన్న ఫ్యామిలీకి ప్యాకేజీలు ప్రకటించి వచ్చారు. వారిలోనే ఒకరిని ఇన్​చార్జిగా నియమించి, పోలింగ్​కు ఒకటి, రెండు రోజుల ముందు తీసుకొచ్చేలా ప్లాన్ ​చేశారు. వెహికల్స్ ఏర్పాటు చేశారు. ఓటుకు రేటు ఫిక్స్​చేయడంతోపాటు దావత్​లు ఇస్తున్నారు. బుధవారం రాత్రి వరకు తండాల్లో జోరుగా మందు పార్టీలు నడిచాయి. పక్క రాష్ట్రాల్లో ఉండిపోయిన మిగిలి వలస కూలీలను గురువారం ఉదయం 10 గంటల్లోపు వెహికల్స్​లో పోలింగ్​బూత్​లకు తీసుకొచ్చి ఓటు వేయించేలా లీడర్లు ప్లాన్ చేశారు..

తండాకో ఇన్ చార్జ్

​క్యాండిడేట్లు ప్రతి తండాకు ఇన్​చార్జిని నియమించి  కూలీల లిస్టులను అప్పగించారు. ప్రతి తండాలో ఒక ఏరియా ఎంపిక చేసి గెట్​టు గెదర్​ పార్టీలు నిర్వహించారు. ఒక్కో క్యాండిడేట్ తరఫున షాపుల్లో 20 కిలోల మటన్, 50 కిలోల చికెన్ ​ఆర్డర్లు ఇచ్చారు. తండాల్లోనే బగారా​తోపాటు చికెన్, మటన్​ను వండించారు. తండాకు 15 కాటన్ల బీర్లు, చీప్​లిక్కర్ ఫుల్​బాటిళ్లు సప్లై చేస్తున్నారు. ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు ఇచ్చారు. ఇంట్లో ఐదుగురుంటే రూ.10 వేలు ఇస్తున్నారు.  

ట్రావెలింగ్ చార్జీలు సపరేట్

ట్రావెలింగ్​చార్జీలు సపరేట్​గా ఇస్తున్నారు. కొందరు వెహికల్స్ ​పెట్టి రప్పించారు.  బస్సుల్లో టికెట్లు బుక్​ చేస్తున్నారు. దారి ఖర్చులు అదనంగా ఇస్తున్నారు. ట్రైన్​లో రావడానికి ఇష్టపడే వారికి ట్రైన్​టికెట్లు బుక్​చేసి మరీ రప్పించారు. ఫ్యామిలీలో నలుగురైదుగురు, పది మంది వరకు ఉంటే కార్లు ఏర్పాటు చేశారు.

ఒక్కో చోట 5 వేల నుంచి 20 వేల మంది

యాదాద్రి : ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి వలస వెళ్లిన ఓటర్లు లక్షకు పైగా ఉంటారని అంచనా. వీరంతా బుధవారం వరకు సొంతూళ్లకు తిరిగొస్తున్నారు. దీంతో నేషనల్​హైవేలు బిజీగా మారాయి. ఆర్టీసీ బస్సుల కంటే ప్రైవేట్ వెహికల్స్ ఎక్కువగా నడిచాయి. యాదాద్రి జిల్లా మీదుగా హైదరాబాద్- వరంగల్ నేషనల్​ హైవేపై బుధవారం 29 వేల వెహికల్స్ రాకపోకలు సాగించాయి. హైదరాబాద్–- విజయవాడ నేషనల్​ హైవేపై 37 వేల వెహికల్స్ రాకపోకలు సాగించాయి. వీటిలో ఎక్కువ వెహికల్స్ వరంగల్, సూర్యాపేట వైపు వెళ్లాయి. టూవీలర్స్ పై కూడా ఎక్కువ మందే వచ్చారు.