వలస కూలీలపై గ్రనేడ్​ దాడి

వలస కూలీలపై గ్రనేడ్​ దాడి
  • వలస కూలీలపై గ్రనేడ్​ దాడి
  • కాశ్మీర్​లో ఇద్దరు మృతి, ఇద్దరు టెర్రరిస్టుల అరెస్టు

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్​లో టెర్రరిస్టులు మళ్లీ దాడికి పాల్పడ్డారు. వలస కూలీలపైకి గ్రనేడ్ విసిరి ఇద్దరి ప్రాణాలు తీశారు. ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్​కు చెందిన మోనీశ్ కుమార్, రామ్ సాగర్ జమ్మూకాశ్మీర్​కు వలస వెళ్లారు. అక్కడ షోపియాన్ జిల్లాలో కూలీలుగా పని చేస్తున్నారు. సోమవారం రాత్రి ఇతర కూలీలతో కలిసి తాము పనిచేసే చోట షెడ్డులో నిద్రపోయారు. మంగళవారం తెల్లవారుజామున ఇద్దరు టెర్రరిస్టులు వాళ్లున్న షెడ్డులోకి గ్రనెడ్ విసిరారు. ఈ దాడిలో మోనీశ్ కుమార్, రామ్ సాగర్ తీవ్రంగా గాయపడ్డారు. వాళ్లిద్దరినీ ఆస్పత్రికి తరలించగా, ట్రీట్ మెంట్ పొందుతూ చనిపోయారు. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో పోలీసులు కార్డన్ సెర్చ్ చేపట్టారు. లష్కరే తాయిబా టెర్రరిస్టు ఇమ్రాన్ బషీర్ గనీ, మరో అనుమానితుడిని అరెస్టు చేశారు. ఇమ్రానే గ్రనేడ్ విసిరాడని కాశ్మీర్ అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్ చెప్పారు.

తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయని, ఈ దాడితో సంబంధం ఉన్న ఏ ఒక్కరినీ వదలబోమని తెలిపారు. ‘‘ఇమ్రాన్ హైబ్రిడ్ టెర్రరిస్టు. ఇలాంటి వాళ్ల పేర్లు టెర్రరిస్టుల జాబితాలో ఉండవు. వీళ్లు రాడికల్ యూత్. జనాల్లోనే ఉంటూ దాడులకు పాల్పడుతూ ఉంటారు” అని ఆయన వెల్లడించారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత డెడ్ బాడీలను విమానంలో లక్నోకు తరలించనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కనౌజ్ కు తీసుకెళ్తారు. కాగా, ఈ ఘటనపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఇది క్రూరమైన దాడి అని మండిపడ్డారు. ఈ దాడిని పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ కాన్ఫరెన్స్, అప్నీ పార్టీ ఖండించాయి.