లాక్ డౌన్ తో రోడ్డున పడ్డ కష్టజీవులు..కాలినడకన సొంతూళ్లకు ప్రయాణం

లాక్ డౌన్ తో రోడ్డున పడ్డ కష్టజీవులు..కాలినడకన సొంతూళ్లకు ప్రయాణం
  • కాలినడకన సొంత రాష్ట్రాలకు ప్రయాణం
  • ఎక్కడికక్కడ ఆపేస్తున్న పోలీసులు
  • ఫుట్​పాత్ మీద, చెట్ల కిందే జీవనం
  • ఎవరైనా ముద్ద పెడితేనే పూట గడిచేది
  • సర్కారు సాయంపై అవగాహన కరువు
  • బియ్యం సరఫరాకు ఆధార్​ లింక్​తో తిప్పలు

చంకలో చంటిబిడ్డ.. భుజానికి ముల్లెమూట.. కాలినడకనే వందలు వేల కిలోమీటర్లు పయనం.. ఒకవైపు బొబ్బలెక్కుతున్న కాళ్లు.. ఇంకో వైపు ఎండుతున్న డొక్కలు.. అయినా ఏదో చిన్న ఆశ. దయగల మారాజులు ఎవరన్నా ఇంత ముద్ద పెట్టకపోతరా అన్న ఆశ. పానం అలిసినప్పుడల్లా.. ఫుట్​పాత్​ మీదనో, చెట్ల కిందనో సేద దీరి మళ్లీ పయనం.. పొట్టచేత పట్టుకొని పట్నం వచ్చిన వలసజీవుల దీనగాథ ఇది!

రాష్ట్రంలో 6.47 లక్షల మంది వలస కార్మికులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించగా.. అదనంగా మరో 5 లక్షల మంది ఉండొచ్చని ఓ అంచనా. అందులో ఎక్కువ మంది హైదరాబాద్​లోనే ఉంటున్నరు. భవన నిర్మాణ కార్మికులుగా కొందరు.. హోటళ్లలో పనివాళ్లుగా ఇంకొందరు.. అడ్డా కూలీలుగా, రోడ్డుపక్కన బొమ్మలు తయారు చేసేవాళ్లుగా మరికొందరు.. ఇలా ఏదో ఒక పనిచేసుకునేందుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా చత్తీస్​గఢ్​, మహారాష్ట్ర, ఒడిశా, బీహార్​, యూపీ తదితర  రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఉంటున్నరు. వీళ్లంతా ఇప్పుడు దిక్కులేని పక్షులయిండ్రు. ఎన్నాళ్లు లాక్​డౌన్​ ఉంటుందో తెలియక, లాక్​డౌన్​ ఎత్తేసినా పనిదొరుకుతుందన్న నమ్మకం లేక.. దిక్కులు చూస్తున్నరు.

హైదరాబాద్​, వెలుగు:కరోనా కట్టడి కోసం నెల రోజులుగా లాక్​డౌన్​ అమలవుతుండటంతో వలస కార్మికుల బతుకులు రోడ్డునపడ్డాయి. పనులు లేకపోవడం.. ఉన్న చోట తిండి దొరకకపోవడంతో చాలా మంది ఫుట్​పాత్​లపైనే  ఉంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పలుచోట్ల సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెబుతోంది. అయితే.. ఆ కేంద్రాల్లో ఉండేందుకు కొందరు ఇష్టపడటంలేదు.. ఇంకొందరికి ఆ కేంద్రాలు ఎక్కడ ఉంటాయో కూడా తెలియని పరిస్థితి.  ‘‘లాక్​ డౌన్ ఎప్పుడు ముగుస్తుందో తెలియదు.. మళ్లా పనులు పుడుతయో లేదో తెలియదు. మమల్ని సొంతూరికి పంపించండి” అని వలస కార్మికులు వేడుకుంటున్నారు. ఎలాగైనా సొంతూరికి చేరుకోవాలని తెగించి కొందరు వందల కిలో మీటర్లు కాలినడకన  బయలుదేరుతున్నారు.

నెల రోజుల నుంచి ఫుట్​పాత్ ​మీదనే..

ఈ ఫొటోలో ఉన్నది ఎస్.కె.బాషా. వలస కూలీ. కర్నూలు జిల్లా కేంద్రానికి దగ్గర్లోని పంచలింగాల ఈయన ఊరు. పదేండ్ల కింద హైదరాబాద్​ సిటీకి వచ్చాడు.  చార్మినార్​ దగ్గర్లలోని షాదీఖానాలో పని చేసేవాడు. షాదీఖానా గిరాకీ లేనప్పుడు బయట పార పని, కంకర పని, లోడింగ్​- అన్​లోడింగ్​ పనులకు పోయేవాడు.  లాక్​ డౌన్​తో షాదీఖానా బందైంది. ఇతర పనులు కూడా లేవు. తిండి కూడా దొరికే పరిస్థితి లేకపోవడంతో ఊరికి పోదామని బయలుదేరాడు. పోయే వీలు లేకపోవడంతో నెల రోజులుగా సాలర్​జంగ్​ మ్యూజియం రోడ్డులోని ఫుట్​పాత్​పైనే ఉంటున్నాడు. రోజూ ఎవరో ఒక దాత ఇచ్చే అన్నంతో ఆకలి తీర్చుకుంటున్నాడు. పక్కనే ఉన్న మ్యూజియంలోని మున్సిపల్​ నల్లాతో దాహం తీర్చుకుంటున్నాడు.

ముల్లెమూట సర్దుకొని.. భుజాన పెట్టుకొని.. చిన్న పిల్లలను చంకన ఎత్తుకొని.. దూరాన్ని లెక్క చేయకుండా నడస్తూనే ఉన్నారు. ఇప్పట్లో మళ్లీ పని దొరికే అవకాశం లేదనే ఆందోళన.. వీరిని సొంతూళ్లకు వెళ్లేలా చేస్తోంది. హైదరాబాద్​ నుంచి మహారాష్ట్ర, చత్తీస్​గఢ్​, ఒడిశా, బీహార్​, యూపీ, ఏపీలోని శ్రీకాకుళం, కర్నూలు వైపు వీరి ప్రయాణం సాగుతోంది. మధ్య మధ్యలో రోడ్డు పక్కన సేదదీరుతూ.. దాతలు ఇంత ముద్దుపెడితే తిని ముందుకు వెళ్తున్నారు. కానీ.. లాక్​ డౌన్​ రూల్స్​ కారణంగా పోలీసులు వీళ్లను  ఆపేస్తున్నారు. చత్తీస్​గఢ్ కు వెళ్లేందుకు సరిహద్దుల దాకా వెళ్లిన వలస కూలీలను పోలీసులు మళ్లీ వెనక్కి పంపారు. మహారాష్ట్రలోని సొంతూరికి బయలుదేరిన వారిని  ఆపి దగ్గర్లోని సహాయ కేంద్రాలకు తరలించారు.

ఎందరో వలస జీవులు

లాక్​ డౌన్​ ప్రకటించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి 3.35 లక్షల మంది వలస కూలీలు ఉన్నట్లు గుర్తించింది. పూర్తి స్థాయిలో వివరాలు సేకరించకపోవడంతో కొంత మంది వివరాలనే నమోదు చేశారు. ఎక్కువ మంది తిండి లేక సొంతూళ్లకు వెళ్తున్న పరిస్థితులను గుర్తించిన ప్రభుత్వం మళ్లీ సర్వే నిర్వహించింది. దీంట్లో  మరో 3.12 లక్షల మంది వలస కూలీలు ఉన్నట్లు గుర్తించింది. ఇలా రెండుసార్లు చేసిన సర్వేలలో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 6.47 లక్షల మంది వలస కార్మికులు ఉన్నట్లు ప్రభుత్వం అంచనాకొచ్చింది. వీరికి సహాయ పంపిణీ ప్రక్రియ జరుగుతోంది. అయితే ప్రభుత్వ యంత్రాంగం వద్ద నమోదు చేసుకోని వలస కూలీలు మరో 5 లక్షల మంది కంటే ఎక్కువ ఉన్నట్లు అంచనా. ‘‘కూలి పని చేసుకనేటోడ్ని. నెల రోజలుగా ఏ పనీ లేదు. జేబుల ఉన్న పైసలు అయిపోయినయ్. నాతోటి వాళ్లతోని కలిసి ఇక్కడే ఫుట్ పాత్​మీద ఉంటున్న. పొద్దుగాల, రాత్రి ఎవరో ఒకలు వచ్చి అన్నం ఇస్తాండ్రు.గవర్నమెంట్​ కేంద్రం ఎక్కడ ఉందో.. ఎవరిని కలవాల్నో తెల్వది. మూడు నెలల కింద యాక్సిడెంట్​ అయి కాలు ఇంకా నొప్పిగ ఉన్నది. ఇప్పుడు నడుచుకుంట ఇంటికి పోలేను’’ అని మెదక్ జిల్లా నర్సాపూర్​కు చెందిన ఎం.నర్సింహా అనే కూలీ అన్నారు. హైదరాబాద్​లో ఏదో ఓ పనిచేసుకొని బతికేందుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా చత్తీస్​గఢ్​, మహారాష్ట్ర, బీహార్​, ఒడిశా, యూపీ​, కర్నాటక నుంచి కార్మికులు పొట్టచేత పట్టుకొని వస్తుంటారు. కొందరు సింగిల్​గా వస్తే.. ఇంకొందరు కుటుంబాలతో వస్తుంటారు.  ఎక్కువ మంది బిల్డింగ్​ నిర్మాణ పనుల్లో, ఫ్యాక్టరీల్లో   పనిచేస్తుంటారు. ఇంకొందరు అడ్డా కూలీలుగా, హోటళ్లలో పనిచేస్తూ కాలం వెళ్లదీస్తుంటారు. కొందరైతే.. రోడ్డుపక్కన బొమ్మల తయారీలోనో, జ్యూస్​ బండి పెట్టుకొనో బతుకుతుంటారు. ఇలా సాగే వీరి జీవితం.. నెలరోజులుగా పనులన్నీ బందవడంతో రోడ్డునపడింది.

ఆధార్​ కార్డు ఉంటేనే..

వలస కార్మికుల ఆకలిని తీర్చేందుకు ప్రభుత్వం ఇచ్చే 12 కిలోల ఉచిత బియ్యం, నెలకు రూ. 500  అందరికీ అందటం లేదు. బియ్యం పంపిణీకి కూలీలందరి వద్ద  ఆధార్​ కార్డు ఉండాలని ఆఫీసర్లు చెబుతున్నారు. ఎక్కువ మంది వలస కూలీలే కావడంతో ఆధార్​ కార్డులు లేవంటున్నారు. ఇంటివాళ్లకు ఫోన్​ చేసి ఆధార్​ వివరాలు తెలుసుకుందామంటే.. కుటుంబీకులు కూడా వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. దీంతో ఆధార్​ నెంబర్​ తెలుసుకునే పరిస్థితి లేదు. ఇక కొందరు కుటుంబ సమస్యలతో పట్నాలకు వలస వచ్చి బతుకుతున్నారు. ఇలాంటివాళ్లు తాము ఇంటికి ఫోన్​ చేసి తెలుసుకునే అవకాశం లేదని వాపోతున్నారు. ‘‘ఇంట్లో సమస్యలతో నాలుగేండ్ల కింద హైదరాబాద్​కు వచ్చిన. సుతారి పనికి పోయోటోడ్ని. బియ్యం కోసం పోతే ఆధార్​కార్డు అడుగుతున్నరు. ఇప్పుడు ఇంటికి ఫోన్​ జేస్తే  నేను ఎక్కడ ఉన్ననో అడుగుతరు. అందుకే ఫుట్​పాత్​పైనే ఉంటున్న’’ అని ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన కూలీ రాజమూర్తి చెప్పారు.

సాయమెక్కడ?

లాక్​ డౌన్​కు ముందు వివిధ సెక్టార్లలో పని చేసే వారికి అక్కడే భోజన సదుపాయాలు ఉండేవి. బిల్డింగ్​ నిర్మాణంతోపాటు కొన్ని ఇతర పనులు చేసే కూలీలకు ఎక్కువ శాతం యజమానులే భోజన వసతి ఏర్పాటు చేసేవారు. ఇప్పుడు పనులు లేకపోవడంతో వారి పని ప్రదేశంలో అన్నం దొరకడం లేదు. దీంతో కూలీలు అక్కడి నుంచి బయటికి వచ్చి ఇంటి బాట పట్టారు. అయితే.. లాక్​డౌన్​ రూల్స్​ కారణంగా సొంతూరు వెళ్లే పరిస్థితి లేదు.  వలస కూలీల్లో ఎక్కువ మంది చదువురాని వాళ్లే ఉంటున్నారు. బియ్యం, డబ్బుల సాయం కోసం వీళ్లంతా  తమ వివరాలతో తహసీల్దార్​ ఆఫీసులో దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల వారు కావడంతో వీరికి తహసీల్దార్​ ఆఫీసులు ఎక్కడో తెలియడంలేదు. లాక్​డౌన్​తో అక్కడికి వెళ్లే పరిస్థితి కూడా ఉండడంలేదు. ఒకవేళ తమ వివరాలు ఇచ్చినా.. కొందరు అధికారులు రేపు మాపు అంటూ దాట వేస్తున్నారని వలస కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

షెల్టర్​లో ఉండలేక..

కరీంనగర్ సిటీ శివారులోని లక్ష్మీ నరసింహ గార్డెన్స్, వాసర ఫంక్షన్​హాల్​లో ఇతర రాష్ట్రాల వలస కార్మికులకు షెల్టర్ ఏర్పాటు చేశారు. రెండుచోట్లా సుమారు 100 మంది వరకు ఉంచారు. మొదట వీరికి ఫుడ్ అందించేందుకు ఆఫీసర్లు, లీడర్లు

పోటీపడ్డారు. ఆ తర్వాత శ్రద్ధ తగ్గింది. ఏమైందో ఏమోగానీ కార్మికులంతా ఫంక్షన్​హాల్​ నుంచి బయటకు వచ్చి అక్కడే గుడారాలు వేసుకొని మూడు, నాలుగు రోజులు ఉన్నారు. అనంతరం నడుచుకుంటూ స్వస్థలాలకు వెళ్లిపోయారు. మెదక్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ రామాయంపేట, చేగుంట ఫంక్షన్ హాల్స్​లో వలస కూలీల కోసం షెల్టర్ ఏర్పాటు చేశారు. రెండు, మూడు రోజులు మాత్రమే ఉన్న కూలీలు ఒకరివెనుక ఒకరు సొంతూరి దారి పట్టారు.

ఎదురుచూపులు

జార్ఖండ్​కు చెందిన ఈ ఆరుగురు కార్మికులు డ్రైనేజీ పనులు చేస్తుంటారు. అంతా హైదరాబాద్​లోని ఉప్పల్​లో ఉంటున్నారు. వీరిని రెవెన్యూ అధికారులు సర్వేలో గుర్తించలేదు. ఒక ఎన్జీవో సహకారంతో  ప్రభుత్వ సాయం కోసం ఏప్రిల్ 1న ఉప్పల్ తహసీల్దార్ ఆఫీసులో అప్లికేషన్​ ఇచ్చారు. ఆ తర్వాత రెవెన్యూ ఆఫీసులో ఆధార్​నంబర్ ఇచ్చారు. బియ్యం, డబ్బుల కోసం ఎప్పుడు ఫోన్ చేసినా ఇంకో రెండు రోజులు అంటూ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికీ వీరికి సాయం అందలేదు.