కేరళలోనిత్రిసూర్, పాలక్కాడ్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం కొన్ని సెకన్లపాటు ప్రకంపనలు సంభవించి ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, 3.0 తీవ్రతతో భూకంపం నమోదైంది. ఎలాంటి ప్రాణనష్టం లేదా నష్టం జరగలేదు. త్రిస్సూర్‌లో ఉదయం 8.15 గంటల ప్రాంతంలో ఉరుములతో కూడిన శబ్దం రావడంతో భూమి ఒక్కసారిగా కంపించిందని ప్రజలు తెలిపారు.
త్రిసూర్‌లోని కున్నంకుళం, ఎరుమపెట్టి, పజాంజి, గురువాయూర్, చొవన్నూర్ ప్రాంతాల్లో స్వల్ప భూకంపం సంభవించినట్లు వెల్లడించారు. కొన్ని ఇళ్లలో వంట చేస్తుండగా ఒక్కసారిగా స్టవ్‌లు ఎగసిపడ్డాయి. అయితే ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా అధికార యంత్రాంగం, జియాలజీ శాఖ ప్రజలకు తెలిపింది.
భూకంపాన్ని నిర్ధారించేందుకు పాలక్కాడ్ జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. దేశంలో భూకంప కార్యకలాపాల పర్యవేక్షణ కోసం భారత ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ అయిన ఎన్ సిఎస్ , భూకంప కేంద్రం అక్షాంశం 10.55 N , రేఖాంశం 76.05 E వద్ద ఏడు కిలోమీటర్ల లోతుతో ఉందని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.