- ఉత్కంఠ మ్యాచ్‌లో గుజరాత్‌ను గెలిపించిన డేవిడ్, రషీద్
- చేజేతులా ఓడిపోయిన చెన్నై
పుణె: గుజరాత్ టార్గెట్ 170. గాయంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యా మ్యాచ్‌లోనే లేడు. ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ (0) డకౌటవగా.. అభినవ్ మనోహర్ (12) ఫెయిలయ్యాడు. అటువైపు చెన్నై బౌలర్లు విజృంభిస్తుండగా.. విజయ్ శంకర్ (0) కూడా సున్నా చుట్టాడు. హార్డ్ హిట్టర్ రాహుల్ తెవాటియా (6) ఫ్లాపయ్యాడు. 87 రన్స్‌కే సగం వికెట్లు కోల్పోయిన గుజరాత్ టైటాన్స్‌కు ఓటమే..! చెన్నై సూపర్ కింగ్స్‌కు లీగ్‌లో రెండో విజయం ఖాయమే అనుకుంటున్న టైమ్‌లో డేవిడ్ మిల్లర్ (51 బాల్స్‌లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 94 నాటౌట్) మిరాకిల్ చేశాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. ఏ బౌలర్‌నూ వదలకుండా ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. అతనికి తోడు స్టాండిన్ కెప్టెన్ రషీద్ ఖాన్ (21 బాల్స్‌లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 40) బ్యాట్‌తో మ్యాజిక్ చేశాడు. దాంతో, ఆదివారం రాత్రి జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో గుజరాత్ 3 వికెట్ల తేడాతో చెన్నైని ఓడించింది. చేతుల్లోకి వచ్చిన మ్యాచ్‌ను సీఎస్‌కే చేజేతులా వదులుకుంది. తొలుత రుతురాజ్ (48 బాల్స్‌లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 73) రాణించడంతో చెన్నై 20 ఓవర్లలో 169/5 స్కోరు చేసింది. రాబిన్ ఊతప్ప (3), మొయిన్ అలీ (1) నిరాశ పరిచినా.. అంబటి రాయుడు (31 బాల్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 46), కెప్టెన్ జడేజా (12 బాల్స్‌లో 2 సిక్సర్లతో 22 నాటౌట్) సత్తా చాటారు. గుజరాత్ బౌలర్లలో జోసెఫ్ (2/34) రెండు వికెట్లు తీశాడు. అనంతరం మిల్లర్, రషీద్ అద్భుత పోరాటంతో గుజరాత్ 7 వికెట్లు కోల్పోయి మరో బాల్ మిగిలుండగానే టార్గెట్‌ను అందుకుంది. చివరి 18 బాల్స్‌లో 48 రన్స్ అవసరమైన దశలో క్రిస్ జోర్డాన్ (0/58) వేసిన 18వ ఓవర్లో రషీద్ కండ్లు చెదిరే షాట్లతో 6,6,4,6 సహా 25 రన్స్ రాబట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. 19వ ఓవర్లో బ్రావో 2 వికెట్లు తీసి 10 రన్సే ఇచ్చినా.. జోర్డాన్ వేసిన ఆఖరి ఓవర్లో మిల్లర్ 6, 4తో పాటు విజయానికి అవసరమైన 13 రన్స్ రాబట్టి గుజరాత్‌ను గెలిపించాడు. సీఎస్‌కే బౌలర్లలో బ్రావో (3/23), మహేశ్ తీక్షణ (2/24) రాణించారు. మిల్లర్‌కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

