
- సర్కారు ధాన్యంతో మిల్లర్ల వ్యాపారం
- తరుగు పూడ్చేందుకు నూకలు, రేషన్ బియ్యం
- ధాన్యం నిల్వలపై టాస్క్ పోర్స్ తనిఖీలు
- జిల్లాలో రూ.12.76 కోట్ల బకాయిలు
జయశంకర్భూపాలపల్లి, వెలుగు: సర్కారు ఇచ్చిన ధాన్యంతో మిల్లర్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. బియ్యం అప్పగించాలని ఆఫీసర్లు ఒత్తిడి తెచ్చే క్రమంలో ఉన్న కొద్దిపాటి బియ్యంలో నూకలు మిక్స్చేయడం, రేషన్ బియ్యాన్నే మళ్లీ సీఎంఆర్‌కు పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2024– 25 వానాకాలం సీజన్లో 31 మిల్లులకు 104,209 టన్నుల ధాన్యం కేటాయించారు. 69,820 టన్నుల బియ్యం సీఎంఆర్‌కు ఇవ్వాల్సి ఉండగా, 62,540 టన్నులే ఇచ్చాయి. 1862 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది.
యాసంగిలో 24 మిల్లులకు 85,654 టన్నుల ధాన్యాన్ని ఇవ్వగా, 58,245 టన్నుల బియ్యం ఇవ్వాల్సింది. 24,882 ఇవ్వగా, 33,363 టన్నుల బియ్యం సీఎంఆర్‌కు మిల్లర్లు ఇవ్వాల్సి ఉంది. గడువు సమీపిస్తున్నా మిల్లర్లు బియ్యం ఇవ్వకపోవడంతో ఇటీవల పౌరసరఫరాల శాఖ, టాస్క్ ఫోర్స్‌టీం సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. బకాయిలు పెండింగ్ పెడుతున్న వారిపై అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు.
మిల్లర్ల మాయ..
ప్రభుత్వానికి అప్పగించాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్ పక్కదారి పడుతోంది.
దీంతో నిర్ణీత సమయంలో మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యం లేకపోవడంతో ఉన్నవాటిలోనే నూకలు మిక్స్ చేస్తున్నారు. మిల్లర్లు సీఎంఆర్‌కు ఇచ్చే బియ్యంలో 25శాతం వరకు నూకలు ఉన్న పాసింగ్ఉండటాన్ని అవకాశంగా తీసుకుంటున్నారు. జిల్లాలోని మిల్లర్లు బియ్యంలో నూకలు కలిపి గోదాముల్లో అన్లోడ్ అయ్యేలా అక్కడి టీఏలను సైతం మేనేజ్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆఫీసర్ల ఒత్తిడి పెరిగితే రేషన్ బియ్యాన్నే రీసైక్లింగ్ చేసి అప్పగిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఆఫీసర్ల తనిఖీలు..
ప్రభుత్వానికి సీఎంఆర్ రైస్ ఇవ్వకపోవడంతో అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. ఇటీవల జిల్లాలోని రేగొండ మండలం లక్ష్మీబిన్ని రైస్‌మిల్, గణపురం మండలం జానకిరామ, కొండాపూర్ లక్ష్మీనరసింహ, మల్హర్ మండలం దుబ్బగుట్టు వెంకటేశ్వర మిల్లర్ల నుంచి వానకాలం సీజన్‌కు గాను 2552 మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉంది. టాప్ 5లో ఈ మిల్లులు ఉండటంతో టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ ప్రభాకర్ నేతృత్వంలో పౌరసరఫరాల టీం మిల్లులో ఇటీవల తనిఖీలు చేపట్టారు. లింగాల లక్ష్మీబన్ని రైస్ మిల్లులో 15వేల బస్తాల ధాన్యం లేదని, కొండాపూర్ లక్ష్మీనరసింహ మిల్లులో 12 వేల బస్తాలు మాయం అయినట్లుగా ఆఫీసర్లు గుర్తించారు. మిల్లర్లు మాత్రం ప్రభుత్వ గోదాములో ధాన్యం ఉందని బుకాయిస్తున్నారు. అక్కడ సైతం తనిఖీలు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు.
రూ.12.76 కోట్ల బకాయిలు..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2022 నుంచి ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని కాజేసి బకాయిలుపడ్డారు. మొగుళ్లపల్లి మండలం సువర్ణలక్ష్మి మిల్లు ఫెనాల్టీతో రూ.1.26 కోట్లు, కాటారం మండలం దామెరకుంట త్రీఆర్స్ మిల్ రూ.3 కోట్లు, రేగొండ మండలం భాగిర్థిపేటకు చెందిన దుర్గభవానీ మిల్లు రూ.8.50 కోట్లు బకాయిలున్నారు. అధికారులు ఈ మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
బకాయిలు రాబడుతాం..
ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్మును బకాయిదారుల నుంచి రాబడుతాం. క్రిమినల్ కేసుల నమోదుతోపాటు ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం వారి ఆస్తులు జప్తు చేస్తాం. మిల్లర్లకు షూరిటీగా ఉన్న వారి మిల్లింగ్చార్జీలు నిలిపివేస్తాం. ప్రభుత్వ గైడ్‌లైన్స్ ప్రకారం మిల్లర్లు సకాలంలో రైస్ ఇవ్వాలి. గడువులోగా ఇవ్వని వారిపై చర్యలు తీసుకుంటాం. ధాన్యం నిల్వలపై నిరంతర నిఘా కొనసాగుతుంది. ప్రతి మిల్లర్ రూల్స్పాటించాల్సిందే.
- సివిల్ సప్లయ్ డీఎం పి.రాములు