మిల్లులకు రేషన్ ధాన్యం మాయం చేసి రేషన్ బియ్యానికి ఎసరు

మిల్లులకు రేషన్ ధాన్యం మాయం చేసి రేషన్ బియ్యానికి ఎసరు
  •   రాత్రివేళల్లో మిల్లులకు డంపింగ్ 
  •   రెండు రోజుల్లో సీఎంఆర్​ గడువు ముగుస్తుండటంతో మిల్లర్ల అడ్డదారులు

జయశంకర్​భూపాలపల్లి, వెలుగు: సీఎంఆర్​ ఇవ్వడంలో మిల్లర్లు మాయ చేస్తున్నారు. కస్టమ్​ మిల్లింగ్​ రైస్​ గడువు రెండురోజుల్లో ముగుస్తుండడంతో అడ్డదారులు తొక్కుతున్నారు. రాత్రి వేళల్లో టన్నుల కొద్ది రేషన్​ బియ్యాన్ని డంపింగ్​ చేసి సంచులు మార్చి ఎఫ్​సీఐకి అంటగట్టేందుకు చూస్తున్నారు. జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో రేగొండ మండలంలోని ఓ మిల్లుకు శనివారం రాత్రి నాలుగు వాహనాల్లో 100 క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని తరలిస్తుండగా టాస్క్​ఫోర్స్, సివిల్​ సప్లయ్​ ఆఫీసర్లు భాగిర్థిపేట వద్ద పట్టుకున్నారు.

మొండికేస్తున్న మిల్లర్లు..

ప్రభుత్వం నుంచి ధాన్యాన్ని తీసుకున్న మిల్లర్లు తిరిగి బియ్యాన్ని ఎఫ్​సీఐ, పౌరసరఫరాల శాఖకు ఇవ్వడంలో మొండికేస్తున్నారు. జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో గతేడాది వానకాలం, యాసంగి సీజన్లు కలిపి 36,525 మెట్రిక్​ టన్నుల బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంది. వానకాలం సీజన్​ గడువు రెండు రోజుల్లో ముగుస్తుంది. ఈ సీజన్​కు గానూ మిల్లర్ల నుంచి 3,925 మెట్రిక్​ టన్నుల బియ్యం రావాల్సింది. 

గడువు రెండు రోజులు ఉండటంతో మిల్లర్లు రేషన్​ బియ్యాన్ని మిల్లులకు తరలించి టార్గెట్​ రీచ్​ అయ్యేలా ప్లాన్​ చేసి, అక్రమదారులు తొక్కుతున్నారు. దీంతో ధాన్యం లేకుండా సీఎంఆర్​ బకాయిలున్న మిల్లర్ల కదలికలపై నిఘా పెట్టిన టాస్క్​ఫోర్స్​ టీంలు రంగంలోకి దిగి అడ్డదారులకు అడ్డుకట్ట వేస్తున్నారు. జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో మొత్తం 31 సీఎంఆర్​ మిల్లుల్లో 10  ఏసీకేలకు పైన బియ్యం ఇవ్వాల్సిన మిల్లులు మూడు ఉన్నాయి. 

మల్హర్​ మండలంలోని దుబ్బగట్టు వేంకటేశ్వర రైస్​మిల్లు 25 ఏసీకేలు, రేగొండ మండలం లింగాలలోని లక్ష్మీట్రేడర్స్ 15 ఏసీకేలు, లక్ష్మీనరసింహ భాగిర్థిపేట 12 ఏసీకేల బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంది. 10 ఏసీకేలలోపు బియ్యాన్ని ఇవ్వాల్సిన మిల్లులు 12 ఉన్నాయి. 1 నుంచి 2 ఏసీకేల లోపు బియ్యాన్ని ఇవ్వాల్సినవి 16 మిల్లులున్నట్లుగా ఆఫీసర్లు చెబుతున్నారు.

బయటపడ్డ భాగోతం..

గడువులోగా సీఎంఆర్​ రైస్​ ఇవ్వకుంటే చర్యలు తప్పవని సివిల్​సప్లయ్​ ఆఫీసర్లు మిల్లర్లకు నోటీసులు జారీ చేయడంతో రేషన్​ బియ్యాన్ని మార్చి ఇచ్చేందుకు మిల్లర్లు ప్లాన్​ వేసినట్లుగా ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే రేగొండ మండలం భాగిర్థిపేట మిల్లులకు నాలుగు వాహనాల్లో తరలుతున్న 100 క్వింటాళ్ల పీడీఏస్​ బియ్యాన్ని శనివారం రాత్రి టాస్క్​ఫోర్సు అడిషనల్​ఎస్పీ ప్రభాకర్​రావు ఆధ్వర్యంలో సివిల్​సప్లయ్​ ఆర్ఐలు కట్ల సురేందర్​రెడ్డి, భాస్కర్ల రాజులు దాడులు చేసి పట్టుకున్నారు. 

దీంతో మిల్లర్ల రేషన్​ బియ్యం రీసైక్లింగ్ భాగోతం బహిర్గతమయ్యింది. అక్రమంగా తరలిస్తున్న వాహనాలను సీజ్​ చేసి నిందితులపై కేసు నమోదు చేశారు. జిల్లాలోని బోర్లగూడెం, పెద్దాపూర్​ పరిధిలోని మిల్లలకు సైతం రేషన్​ బియ్యం సప్లయ్​ భారీగా జరుగుతున్నట్లుగా పలువురు మిల్లర్లు బాహటంగానే పేర్కొంటున్నారు. కొందరు రేషన్​డీలర్లు సైతం మిల్లింగ్ వ్యాపారంలోకి దిగి తమ అనుచరులతో బియ్యాన్ని మిల్లులకు చేరుస్తున్నట్లుగా సమాచారం. ఇదంతా ఆఫీసర్ల కనుసన్నల్లోనే జరుగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

 గతంలోనే కేసులపాలైన వారే మళ్లీ ఇలాంటి దందాకు తెరలేపడం విశేషం. ఉమ్మడి వరంగల్, కరీంనగర్​, మంచిర్యాల జిల్లాలో సైతం పట్టుబడిన కేసుల పాలైన రేషన్​ స్మగ్లర్లు సీఎంఆర్​ మిల్లులకు కావాల్సిన బియ్యాన్ని మిల్లర్ల నుంచి ఆర్డర్లు తీసుకుని రాత్రికిరాత్రే మిల్లులకు చేరువేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

గడువులోగా బియ్యం ఇవ్వకుంటే చర్యలు..

మిల్లర్లు గడువులోగా బియ్యం ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటాం. పెండింగ్​లోని మిల్లర్లకు ఇప్పటికే నోటీసులు జారీ చేశాం. సకాలంలో బియ్యం ఇవ్వకుంటే గ్యారెంటీల మిల్లింగ్ చార్జీలు నిలిపివేస్తాం. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. ధాన్యం నిల్వలపై నిఘా పెంచాం. - రాములు, సివిల్ సప్లయ్​ డీఎం, భూపాలపల్లి