వడ్ల కొనుగోళ్లలో మిల్లర్ల దందా

వడ్ల కొనుగోళ్లలో మిల్లర్ల దందా
  • వానాకాలం వచ్చినా యాసంగి సీఎంఆర్ పూర్తికాలే
  • ఇప్పటికి 46% బియ్యం మిల్లుల్లోనే..
  • మంచి బియ్యం అమ్ముకొని.. ముక్కిన బియ్యం లెవీకీ
  • నకిలీ ట్రక్‌‌‌‌షీట్లతో రేషన్ ​బియ్యం రీసైక్లింగ్
  • అడ్డంగా దొరుకుతున్నా అరకొర చర్యలే
  • ఈ సీజన్​లో క్వింటాల్ కు 6 నుంచి 8 కిలోల కోత

క్వింటాల్ వడ్లకు సంచి బరువు కింద కిలో 62 గ్రాములు తప్ప ఎలాంటి ఎక్స్​ట్రా కటింగులు  పెట్టకూడదు. కానీ మెజారిటీ ​మిల్లులు 7 నుంచి 8 కిలోల దాకా కోత పెడ్తున్నాయి. ఇంత కోస్తరా.. అని ప్రశ్నిస్తే వాళ్ల లోడ్ దింపుకుంటలేరు. ములుగు జిల్లా వెంకటాపురంలోని ఓ రైస్​మిల్లర్ ఏకంగా రైతులు, కొనుగోలు సెంటర్​ నిర్వాహకులతో క్వింటాల్‌‌‌‌కు 7.5 కిలోల తరుగు తీసేస్తానంటూ అగ్రిమెంట్‌‌‌‌ చేసుకున్నాడు. ఇంత బాజాప్త దోపిడీ చేస్తున్నా సర్కారు కళ్లుమూసుకుంటోంది. 

2019లో ములుగులోని సాయి సహస్ర బాయిల్డ్ రైస్ మిల్ రూ.8 కోట్ల విలువ చేసే 290 క్వింటాళ్ల సీఎంఆర్ బియ్యం ఇవ్వకుండా ఎగ్గొట్టింది. బోరు నర్సాపూర్ కు చెందిన దుర్గ బాయిల్డ్ రైస్ మిల్  రూ.5 కోట్ల విలువచేసే   బియ్యం ఇవ్వలేదు. ఈ రెండింటిపై కేవలం కేసులు పెట్టి వదిలేశారు. రూ.13 కోట్ల సొమ్మును రికవరీ కాలేదు.  

ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం సొసైటీ ప్రభుత్వ వడ్ల కొనుగోలు కేంద్రం నిర్వాహకులు గత యాసంగి సీజన్లో ఖాళీ ట్రక్ షీట్లతో రూ. కోటి కొల్లగొట్టారు. మామిడితోట, సుబాబుల్ చెట్లు ఉన్న భూముల సర్వే నెంబర్లలో ధాన్యం పండించినట్టుగా చూపి, వడ్లు కొనకుండా, రైస్ మిల్లులకు వడ్లు సప్లై చేసినట్టు ట్రక్ షీట్లపై లెక్కలు చూపించారు. ఈ వ్యవహారంలో ముగ్గురు మిల్లర్లు, సొసైటీ నిర్వాహకులపై కేసు నమోదైంది. డబ్బులు రికవరీ చేయలేదు.

జయశంకర్ భూపాలపల్లి/ నెట్​వర్క్​, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా అన్ని సెంటర్లలో పూర్తిగా ఆరిన, తాలులేని వడ్లనే సర్కారు కొంటోంది. అలాంటప్పుడు క్వింటాల్​కు సంచి బరువు కింద ఎక్కువలో ఎక్కువ రెండు కిలోలే తరుగు తీయాలి. కానీ రైస్​మిల్లులు 7 నుంచి 8 కిలోలు కట్​చేస్తూ రైతుల కష్టాన్ని దోచుకుంటున్నాయి. మిల్లర్ల తీరుపై రైతులు అన్ని జిల్లాల్లో ఆందోళనలు చేస్తున్నా సర్కారు నుంచి స్పందన లేదు. ఇక పలు రైస్​ మిల్లుల్లో నకిలీ ట్రక్​ షీట్లతో రేషన్ రీ సైక్లింగ్ దందా నడుస్తున్నా, సీజన్​ దాటినా సీఎంఆర్​ రైస్​ ఇవ్వకపోయినా, లెవీ బియ్యాన్ని అడ్డదారిలో అమ్ముకుంటున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వ పెద్దల అండదండలతోనే  మిల్లర్లు ఈ స్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. 

సీఎంఆర్ రైస్ ​ఇయ్యకున్నా నో యాక్షన్
రాష్ట్రంలో సుమారు 2,200 రైస్​మిల్లులున్నాయి. వీటిలో వెయ్యిదాకా పారాబాయిల్డ్​ మిల్లులు. రెండు సీజన్లలోనూ సర్కారు రైతుల నుంచి వడ్లు కొని రైస్ మిల్లులకు పంపించి కస్టమ్ మిల్లింగ్​ రైస్ (సీఎంఆర్) కింద తిరిగి బియ్యం సేకరిస్తోంది. ప్రతి క్వింటాల్​కు రా రైస్ అయితే 67 కిలోలు, బాయిల్డ్​అయితే 68 కిలోల బియ్యాన్ని మిల్లులు అప్పగించాలి. ఇందుకు క్వింటాలుకు రూ.10 చొప్పున మిల్లింగ్​చార్జీలు సర్కారు చెల్లిస్తోంది. తవుడు, ఉనక, నూకలు మిల్లులే అమ్ముకుంటాయి. ఈ రాబడితో సంతృప్తి చెందని మిల్లుల యాజమాన్యాలు అక్రమాలకు పాల్పడుతున్నాయి. సీఎంఆర్​ కింద ఏ సీజన్లో ఇవ్వాల్సిన వడ్లను అదే సీజన్లో బియ్యంగా మార్చి ప్రభుత్వానికి ఇవ్వకుండా కావాలనే లేట్​ చేస్తున్నాయి. గత యాసంగిలో 92.34 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్లను మిల్లులకు కేటాయిస్తే 62.52 లక్షల మెట్రిక్​ టన్నుల బియ్యాన్ని ఎఫ్​సీఐ, సివిల్​సప్లయ్​ డిపార్ట్​మెంట్​కు అప్పగించాల్సి ఉంది. కానీ వానాకాలం సీజన్​ స్టార్ట్​అయినా కేవలం 33.82 లక్షల మెట్రిక్​టన్నుల బియ్యాన్నే (54%) మిల్లర్లు అందించాయి. ఇంకా 28.70 మెట్రిక్​టన్నుల బియ్యం మిల్లర్ల వద్దే ఉన్నాయి. నెలనెలా గడువు పొడిగించడం తప్ప లెవీ టార్గెట్​ రీచ్​కాని మిల్లర్లపై సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఇదే అదునుగా మిల్లర్లు ప్రభుత్వానికి ఇయ్యాల్సిన మంచి​రైస్​ను బయట ఎక్కువ రేట్లకు అమ్ముకుంటూ మిల్లింగ్​చేసేటప్పుడు మిగిలే నాసిరకం బియ్యాన్ని కొద్దికొద్దిగా లెవీ పెడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఫలితంగా పేదలకు మెరిగలు, నూకల బియ్యమే దిక్కవుతున్నాయి. 

నకిలీ ట్రక్ షీట్లతో రీస్లైక్లింగ్​ దందా
కొందరు రైస్ మిల్లర్లు సెంటర్ల నిర్వాహకులతో కలిసి నకిలీ ట్రక్ షీట్లతో అక్రమాలకు పాల్పడుతున్నారు. కొనని వడ్లను కొన్నట్టు చూపి ఆ ప్లేస్​లో రేషన్ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేస్తున్నారు. రేషన్ డీలర్ల నుంచి క్వింటాల్​కు రూ.800 నుంచి వెయ్యి చొప్పున కొని వాటినే తిరిగి లెవీ కింద సర్కారుకు అప్పజెప్పి రూ.2,500కుపైగా దండుకుంటున్నారు. ఈ విషయంపై ఇటీవల ప్రతిపక్ష లీడర్లు ఆందోళనలు చేయడంతో తూతూమంత్రంగా కొన్ని మిల్లులపై కేసులు పెట్టి వదిలేశారు. 

అగ్గువకు సన్నవడ్లు
దొడ్డు వడ్లతో పోలిస్తే సన్న వడ్ల సాగుకు పెట్టుబడి ఎక్కువ, దిగుబడి తక్కువ. గతంలో మిల్లర్లే సన్నొడ్లను కొనేవారు. రెండేండ్ల కింద క్వింటా వడ్లను రూ.2,200కు కొన్నారు. ప్రస్తుతం రూ.1,960కే సర్కారు సన్నవడ్లను కొని మిల్లర్లకు పంపుతోంది. ఈ రేటు గిట్టుబాటు కాదని రైతులు రెండేళ్లుగా ఆందోళన చేస్తున్నారు. గతేడాది సీఎం కేసీఆర్ సన్నొడ్లకు అదనంగా రూ.100 నుంచి రూ.150 ఇస్తామని హామీ ఇచ్చారు. అది ఇంతవరకు నెరవేరలేదు. 

తరుగు పేరిట నిలువు దోపిడీ
ప్రతి సీజన్లోనూ రైస్ మిల్లర్లు తరుగు పేరిట రైతులను దోపిడీ చేస్తున్నారు. 40 కిలోల బస్తాకు కొనుగోలు సెంటర్లలోనే 2 కిలోల చొప్పున నిర్వాహకులు తరుగు తీసి రైస్ మిల్లుకు పంపిస్తే అక్కడ మిల్లర్లు క్వింటాలుకు మరో 4 నుంచి 7 కిలోల వరకు కోతపెడుతున్నారు. ఈ తరహా కటింగులకు రైతులు ఒప్పుకోకపోతే లారీలను దింపుకోకుండా 3, 4 రోజులు వెయిట్​ చేయిస్తున్నారు. దీంతో రైతులు ప్రతి క్వింటాల్ ధాన్యంపై రూ.150 నుంచి 200 కోల్పోతుంటే దాన్ని మిల్లర్లు మిగుల్చుకుంటున్నారు.

మిల్లర్లు రూ.20వేలు ముంచిన్రు
పదెకరాల్లో పండిన 110 క్వింటాళ్ల వడ్లను పీఏసీఎస్ కొనుగోలు కేంద్రానికి తీసుకపోయిన. వాళ్లు చెక్​చేసి బెస్ట్ క్వాలిటీ ధాన్యం అన్నారు. అంతా లోడు ఎత్తి రైస్ మిల్లుకు పంపినం. కానీ రైస్ మిల్లర్ ఫోన్ చేసి వడ్లు రంగు మారాయని, తాలు ఎక్కువుందని చెప్పి10 క్వింటాలు తరుగు తీస్తనని చెప్పాడు. నేను ఒప్పుకోకపోవడంతో మూడు రోజులు లోడ్​ దింపుకోలే. చేసేదేమీ లేక 10 క్వింటాళ్ల తరుగుకు ఒప్పుకున్నా. రూ.20 వేల నష్టం వచ్చింది.
‒ గండేపల్లి సతీష్, వెంకటాపురం, ములుగు జిల్లా