- పది రోజులుగా రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న భారీ వానలు
- వరదలకు ఇప్పటి వరకూ 12 మంది మృతి
- వచ్చే రెండు రోజులు కూడా భారీ వర్షాలు!
కాలిఫోర్నియా : అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రాన్ని గత పది రోజులుగా భారీ వానలు, తుఫాన్లు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల వల్ల ఏర్పడిన వరదలకు వివిధ ప్రాంతాల్లో ఇప్పటి దాకా12 మంది చనిపోయారు. వచ్చే రెండు, మూడు రోజుల్లోనూ కుండపోత వర్షాలతో పాటు మంచు కురిసే అవకాశం ఉందని నేషనల్ వెదర్ సర్వీస్ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. సెంట్రల్ కాలిఫోర్నియాలోని తీర ప్రాంతాల్లో 13 సెంటీమీటర్ల వరకు వానలు పడవచ్చన్నారు. ‘‘వచ్చే కొద్ది రోజులు చాలా ప్రతికూలంగా ఉండనున్నాయి. తుఫాను వల్ల లక్ష మందికి సోమవారం కరెంటు లేకుండా పోయింది. భారీ వానలు వరదలకు దారితీసే ప్రమాదం ఉంది. సీరా నెవడా పర్వత ప్రాంతాల్లో ఆరు ఫీట్ల దాకా మంచు కురవవచ్చు. పౌరులందరూ సేఫ్ గా ఉండాలని హెచ్చరిస్తున్నాం” అని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసామ్ తెలిపారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని, రెస్క్యూ టీంలు, ఎమర్జెన్సీ టీంలను రెడీగా ఉంచామని ఆయన చెప్పారు.
నెల రోజుల్లో మాంటెసిటో నగరంలో 3099 సెంటీమీటర్ల వర్షపాతం
కాలిఫోర్నియా రాష్ట్రంలో మోంటెసిటీ నగరానికి బురద ముప్పు పొంచి ఉంది. గత కొద్ది రోజులుగా సిటీలో భారీ వానలు కురుస్తున్నాయి. దీంతో ఎత్తైన ప్రాంతాల నుంచి బురదతో కూడిన వరద అత్యంత ఉధృతంగా ప్రవహిస్తోంది. వెంటనే ఇండ్లు ఖాళీ చేయాలని ఫైర్ డిపార్ట్ మెంట్ స్థానికులతో పాటు సెలబ్రిటీలకూ హెచ్చరిక జారీ చేసింది. ఓప్రా విన్ర్ఫే, బ్రిటన్ ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ వంటి సెలబ్రిటీలతో పాటు ఎంటర్ టెయిన్ మెంట్ రంగానికి చెందిన ప్రముఖులు మాంటెసిటీలో నివాసముంటున్నారు. పరిస్థితి ఏ క్షణంలోనైనా ప్రమాదకరంగా మారవచ్చని, బురదతో కూడిన వరద ఇండ్లను ముంచెత్తే ప్రమాదం ఉందని ఎమర్జెన్సీ ఆఫీసర్లు హెచ్చరించారు. అందరూ ఇండ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోవాలని సూచించారు. ‘‘గత నెల రోజుల్లో మాంటెసిటీలో 3099 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వార్షిక సగటు 43 సెంటీమీటర్లను దాటి వానలు కురిశాయి. దీంతో ఎత్తైన ప్రాంతాల నుంచి బురదతో కూడిన వరద నివాస ప్రాంతాల మధ్య భారీగా ప్రవహిస్తోంది. చెత్తాచెదారమంతా వరదలో కొట్టుకుని వస్తోంది” అని ఎమర్జెన్సీ అధికారులు తెలిపారు.
