
- ఎట్ల తయారు చేయాలనే వీడియోలకు లక్షల్లో వ్యూస్
- ఇంట్లనే చేసేటందుకు కొత్త కొత్త ప్రయత్నాలు
- అటు కల్లు, ఇటుగుడుంబాల పైనా నజర్..
- ఏవేవో తాగి ప్రాణాల పైకి తెచ్చుకుంటున్నరు
హైదరాబాద్, వెలుగు: లాక్ డౌన్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి యూట్యూబ్‌లో అత్యధికంగా చేసిన సెర్చ్ ల్లో ‘హౌ టు ప్రిపేర్ ఆల్కహాల్’ అనే పదాలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. వీటితోపాటు ‘లిక్కర్ ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ అమ్ముతున్నారు, ఏ రేట్లు పలుకుతున్నాయి.. అనేవీ ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. గూగుల్ ట్రెండ్స్ ఇండియా రిపోర్టుల్లోనే ఈ లెక్కలు బయటపడ్డాయి. మార్చి 22 నుంచి మార్చి 28వ తేదీ వరకు, ఏప్రిల్ 12వ తేదీ నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరకు గూగుల్‌లో లక్షల సంఖ్యలో సెర్చ్‌లు లిక్కర్‌కు సంబంధించినవే ఉన్నాయి. ఇలా లిక్కర్ తయారీపై సెర్చ్ చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ పదో స్థానంలో నిలిచింది. మణిపూర్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, అసోం, ఏపీలు వరుసగా ఆరు స్థానాల్లో ఉన్నాయి.
బీర్ తయారు చేసే విధానం కోసం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సెర్చింగ్ ఎక్కువగా ఉంది. అందులో మన రాష్ట్రం ఐదో ప్లేస్‌లో ఉంది. ఢిల్లీ టాప్‌లో ఉండగా.. తర్వాత వరుసగా కేరళ, హర్యానా, కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, ఏపీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ టాప్10 స్థానాల్లో నిలిచాయి. అసలు మార్చి 22 నుంచి మార్చి 28 వరకు బీర్ల తయారీ టాపిక్కే గూగుల్ ట్రెండ్స్‌లో టాప్‌లో నిలిచింది. బీర్ ఎలా తయారుచేసుకోవచ్చో వివరిస్తూ మార్చి 24న పెట్టిన వీడియోకు పది లక్షలకుపైనే వ్యూస్ వచ్చాయి. వైన్ తయారీ గురించి పెట్టిన మరో వీడియోను ఐదు లక్షల మంది చూశారు. ఆరెంజ్, ద్రాక్ష, స్ట్రాబెర్రీ, వాటర్ మెలన్‌తో లిక్కర్ తయారు చేయొచ్చంటూ పెట్టిన వీడియోలను జనం తెగ చూసేస్తున్నరు. క్యారట్, ఈస్ట్, జింజర్, పైనాపిల్‌లను వాడి బీర్లను తయారుచేసే వీడియోలనూ చాలా మంది చూస్తున్నారు.
నాన్ఆల్కహాల్ బీర్లనూ వదుల్తలేరు..
రెగ్యులర్ బీర్లు దొరక్కపోవడంతో కొందరు జీరో ఆల్కహాల్ బీర్లు, ఆల్కహాల్ ఫ్రీ బీర్ల పేరుతో దొరుకుతున్న వాటివైపు దృష్టిపెట్టారు. కొన్ని సూపర్ మార్కెట్లు, దుకాణాల్లో అవి దొరుకుతుండటంతో.. క్యూలైన్లలో నిలబడి మరీ కొనుక్కుపోతున్నారు. బీర్లు, లిక్కర్ విక్రయించే బ్రాండ్ల పేర్లతోనే.. వివిధ ఫ్లేవర్లతో ఈ ఆల్కహాల్ ఫ్రీ బీర్లు దొరుకుతున్నాయి. చాలా మంది వాటిని తాగుతూ బీర్లలా ఫీలవుతున్నారు.
నిజామాబాద్‌లో దేశీ వోడ్కా
లిక్కర్ దొరకని పరిస్థితిలో కొందరు దేశీ పద్ధతుల్లో లిక్కర్ తయారుచేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో అయితే గుడుంబాలో కూల్‌డ్రింక్ కలిపి దేశీ వోడ్కా అనే పేరుతో అమ్ముతున్నారు. బెల్లంతో కొందరు, ఇప్ప పువ్వుతో మరికొందరు గుడుంబా తయారుచేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇల్లీగల్ కావడంతో ఎక్సైజ్ అధికారులకు దొరికిపోతున్నారు. ఇక చెట్ల కల్లులో ఆల్ఫ్రజోలం కలిపి అమ్ముతున్న సంఘటనలు చాలానే బయటపడుతున్నాయి. కొందరు ఇలాంటి కల్తీ కల్లు తాగి ప్రాణాలు కోల్పోతున్నారు.
ద్రాక్ష రసం నుంచి లిక్కర్
గత నెల 19న హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో ద్రాక్ష రసంతో మద్యం తయారు చేస్తున్న తల్లీకొడుకులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 25 లీటర్ల ఆల్కహాల్ తయారు చేసే ద్రాక్ష ముడిసరుకు టిన్, 5 లీటర్ల ఫుల్ ఆల్కహాల్ టిన్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వైన్‌షాపులు లేకపోవడంతో వాళ్లు ఇంట్లోనే ఆల్కాహాల్ తయారు చేయడం మొదలుపెట్టారు.
ఎర్రగడ్డకు తగ్గిన పేషెంట్లు
లిక్కర్ దొరక్క చాలా మందిలో ‘విత్ డ్రాయల్ సింప్టమ్స్’ కనిపించాయి. మొదట్లో వందల మంది హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్‌కు క్యూ కట్టారు. తర్వాత ఆ సంఖ్య బాగా తగ్గి రోజుకు ఇద్దరు, ముగ్గురికి వచ్చింది. ఎక్కువ డబ్బులు పెట్టి అయినా లిక్కర్ కొనడం, అక్రమ లిక్కర్, మత్తు కోసం ఇతర మార్గాలను ఆశ్రయించడం వల్లే.. హాస్పిటల్‌కు వచ్చే వారి సంఖ్య తగ్గి ఉంటుందని, కొందరిలో త్వరగానే విత్‌డ్రాయల్ సింప్టమ్స్ తగ్గే అవకాశాలు ఉంటాయని డాక్టర్లు చెప్తున్నారు. లిక్కర్‌కు బదులుగా సారా, కల్లుతోపాటు గుట్కా, గంజాయి వైపు మళ్లుతున్నారని.. అందుకే హాస్పిటల్ కు మందు బాబుల రాక తగ్గిందని నిపుణులు చెప్తున్నారు. ఆల్కహాల్ ఉంటుందని, మత్తు వస్తుందన్న భావనతో కొందరు స్పిరిట్, పెట్రోల్ వంటివి తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
‘లాక్డౌన్’లిక్కర్ దారుణాలూ ఉన్నయి
- లిక్కర్ దొరక్క పోవడంతో చాలా మంది మత్తు కోసం ఇతర రసాయనాలను ఆశ్రయించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. స్పిరిట్, శానిటైజర్ వంటివి తాగడం, కల్తీ కల్లు కారణంగా మృతి చెందినవారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.
- వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలం చించల్‌పేటలో మార్చి 31న కల్తీ కల్లు తాగి లక్ష్మమ్మ అనే మహిళ మృతిచెందగా.. మరో 20 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
- గత నెల 29న యాదాద్రి భువనగిరి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీలో రియాజ్(21), షేక్ బాబా(35) మత్తు కోసం స్పిరిట్‌లో నీళ్లు కలుపుకొని తాగారు. తర్వాత తీవ్రంగా కడుపునొప్పి రావడంతో హైదరాబాద్‌లోని ఉస్మానియాకు రిఫర్ చేశారు. అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయారు.
- ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో గత నెల ఒకటిన ఇలాంటి ఘటనే జరిగింది. మద్యం లేకపోవడంతో స్పిరిట్ తాగి ముగ్గురు చనిపోయారు. మరో ముగ్గురు హెల్త్ సమస్యల బారినపడ్డారు.
- గత నెలలోనే ఏపీలోని అనంతపురం జిల్లా పాతూరుకు చెందిన ఓ యువకుడు మత్తు వస్తుందని శానిటైజర్ తాగేశాడు. నెల్లూరు జిల్లాలోని డీసీపల్లికి చెందిన నలిపోగు నరేశ్ అనే వ్యక్తి పెట్రోల్‌లో శానిటైజర్ కలుపుకుని తాగి, ప్రాణాలు కోల్పోయాడు.
వందల మంది అరెస్టు
రాష్ట్రంలో గుడుంబా తయారు చేస్తున్నవాళ్లు, అమ్మేవారిపై ఎక్సైజ్ అధికారులు 1,922 కేసులు పెట్టారు. 8,091 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ లిక్కర్ అమ్మేవారిపై 743 కేసులు పెట్టి.. 777 మందిని అరెస్టు చేశారు. 6,223 లీటర్ల లిక్కర్, 4,525 లీటర్ల బీరును సీజ్ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి లిక్కర్తీసుకొచ్చిన 21 మందిపై కేసులు పెట్టి.. 212 లీటర్ల లిక్కర్, 22 లీటర్ల బీరును స్వాధీనం చేసుకున్నారు. లైసెన్సు నిబంధనలకు విరుద్ధంగా లిక్కర్ అమ్మిన 45 వైన్స్‌లపై కేసులు నమోదు చేసి, 80 మందిని అరెస్ట్ చేశారు.