
ముంబై: పాక్ ప్రోద్బలంతోనే పుల్వామా ఉగ్రదాడి జరిగిందని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఇండియాలో ఉన్న ముస్లింల గురించి పాక్ చింతించాల్సిన అవసరంలేదని హితవు పలికారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఇమ్రాన్ ఖాన్ కు చెప్పేది ఒక్కటే.. టీవీ కెమెరాల ముందు కూర్చొని ఇండియాకు సుద్దులు చెప్పడం మానుకోవాలి. గతంలో పఠాన్ కోట్, ఉరీ ఘటనలు జరిగాయి. ఇప్పుడు పుల్వా మా దాడి జరిగింది. ముందు మీ అమాయకత్వపు ముసుగు తీసేయండి ’ అని వార్నింగ్ ఇచ్చారు. దాడికి సూత్రధారి అయిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థపైనా ఒవైసీ మండిపడ్డారు. ఇస్లాం ఎప్పుడూ ఓ మనిషిని చంపాలని చెప్పదన్నారు.
‘40 మంది జవాన్లను పొట్టన బెట్టుకు న్న మీది జైషే మహ్మద్ సంస్థ కాదు.. జైషే సైతాన్ . మసూద్ అజర్..మౌలానా కాదు, దయ్యం. అది లష్కరేతోయిబా కాదు.. లష్కరే సైతాన్ ’ అని విమర్శించారు. ‘పాక్ కు చెందిన ఓ మంత్రి భారత దేవాలయాల్లో గంట మోగకుండా చేస్తామని హెచ్చరించారు. ఇండియాలో ముస్లింలు బతికున్నంత కాలం ఇక్కడ మసీదుల్లో ఆజాన్ , దేవాలయాల్లో గంటలు మోగుతూనే ఉంటాయి. ఇది ఇండియా గొప్పతనం. ఇది చూసి పాక్ ఓర్వే లేకపోతోంది. మా మధ్య భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ.. దేశం జోలి కి వస్తే మాత్రం మేమంతా ఒక్కటే’ అని తెలిపారు ఒవైసీ.