అసద్ కో గుస్సా కైకూ..? బీఆర్ఎస్ తో ఎంఐఎంకు చెడిందా!

అసద్ కో గుస్సా కైకూ..? బీఆర్ఎస్ తో ఎంఐఎంకు చెడిందా!

కేసీఆర్ తీరును ఎందుకు తూర్పారబట్టారు?
ఒంటరిగా పోటీ చేస్తే నష్టమెవరికి?
19 చోట్ల పతంగ్ పార్టీకి ఓటు బ్యాంకు
విన్నింగ్ ఫ్యాక్టర్ ను డిసైడ్ చేసే చాన్స్  
పరిణామాలను గమనిస్తున్న కాంగ్రెస్
గెలుపోటములపై లెక్కలేసుకుంటున్న బీజేపీ

హైదరాబాద్ : ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కి కేసీఆర్ పై కోపమెందుకు వచ్చింది.. ఎందుకలా గొంతు చించుకొని కామెంట్లు చేశారు..? రెండు రోజుల క్రితం ఆదిలాబాద్ లో ఓ బహిరంగ సభలో పాల్గొన్న అసదుద్దీన్ కేసీఆర్ సర్కారు తీరును తూర్పారా పట్టడం వెనుక వ్యూహం ఏమిటి అన్నది చర్చనీయాంశమైంది. తెలంగాణ ప్రభుత్వం ముస్లింల సంక్షేమం కోసం పనిచేయడం లేదని, రూ. 1200 కోట్లు ఖర్చు చేసి యాదాద్రి ఆలయాన్ని, బ్రాహ్మణ సదన్ కట్టిన కేసీఆర్.. ఇస్లామిక్ సెంటర్ విషయాన్ని పట్టించుకోవడం లేదన్నారు. షాదీ ముబారక్ చెక్కులు రావడం లేదని, సెక్రటేరియట్ పూర్తి చేసినా అందులో మసీదు విషయాన్ని గాలి కొదిలేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయని, ఇప్పటి వరకు తమ ఓట్లతో కేసీఆర్ సీఎం అయ్యారని, అప్పుడు తామేంటో చూపిస్తామన్నారు. 

ఇప్పటి వరకు ఓల్డ్ సిటీ కే పరిమితమైన పతంగ్ పార్టీ మహారాష్ట్ర, యూపీ, బిహార్ లలో పోటీ చేసి పలుచోట్ల విజయం సాధించింది. పాత నగరంలో ఏడుగురు ఎమ్మెల్యేలున్న ఎంఐఎం ఈ సారి గ్రేటర్ బయట కాలు పెట్టేందుకు రెడీ అవుతున్నది. తమకు ఓటు బ్యాంకు ఉన్నజూబ్లీహిల్స్​, రాజేంద్రనగర్​, అంబర్​ పేట్​, ముథోల్​, నిర్మల్​, ఆదిలాబాద్​, ఖానాపూర్, నిజామాబాద్​, కామారెడ్డి, బోధన్​, కరీంనగర్, జగిత్యాల, మహబూబ్​ నగర్​, వరంగల్​ ఈస్ట్​, ఖమ్మం సహా పలు నియోజకవర్గాల్లో పోటీకి ప్లాన్​ చేసుకుంటోంది. కనీసం 30 అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థులను నిలిపే ప్రయత్నాల్లో ఆ పార్టీ ముఖ్య నేతలున్నారు. ఇందులో భాగంగానే అసదుద్దీన్ ఒవైసీ ఆదిలాబాద్ లో నిర్వహించిన సమావేశానికి వెళ్లినట్టు తెలుస్తోంది. 

ఒంటరిగా పోటీ చేస్తే ఎవరికి ఫాయిదా!

రాష్ట్ర వ్యాప్తంగా 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఐఎం ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఏ పార్టీకి లాభం చేకూరుతుంది? ఎవరికి నష్టం జరుగుతుందనే అంశంపై విశ్లేషణలు మొదలయ్యాయి. ఎంఐఎం ఒంటరిగా పోటీ చేయడం ద్వారా ముస్లిం ఓట్లు గంప గుత్తగా ఎంఐఎంకు పడితే బీఆర్ఎస్,కాంగ్రెస్ కు నష్టం జరుగుతుంది. ఇదే అదనుగా హిందూ ఓట్లు ఒక వైపే పడితే బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశాలెక్కువని విశ్లేషకులు అంటున్నారు. 

ఎంఐఎం టార్గెట్ చేసిన సెగ్మెంట్లలో కాస్తా గట్టిగా వర్క్ చేస్తే బీజేపీకి ఎక్కువ విజయావకాశాలుంటాయని తెలుస్తోంది. మసీదులకు నిధులు, మొల్లాలకు గౌరవ వేతనం, షాదీముబారక్, ఉర్దూఘర్ ల నిర్మాణం, ముస్లిం రిజర్వేషన్లు లాంటివి అమలు చేసి ఆ ఓటు బ్యాంకుపై కన్నేసిన బీఆర్ఎస్ కు నష్టం జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంచితే బీఆర్ఎస్ నుంచి దూరమవుతున్న ఎంఐఎంను తమ వైపు తిప్పుకోవడం ద్వారా లబ్ధిపొందాలని కాంగ్రెస్ పార్టీ భావించే అవకాశం ఉంది.