ప్రార్థనా స్థలాల చట్టాన్ని నీరుగార్చేలా కోర్టు తీర్పు

ప్రార్థనా స్థలాల చట్టాన్ని నీరుగార్చేలా కోర్టు తీర్పు

జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి జిల్లా కోర్టు ఆదేశాలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఈ ఉత్తర్వులపై హైకోర్టులో అప్పీల్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంజుమన్ ఇంతెజామియా కమిటీ ఈ అప్పీల్ చేస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఆదేశాల తర్వాత ప్రార్థన స్థలాల చట్టం 1991 ఉద్దేశం నీరుగారుతుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ‘‘ఈ తీర్పు తర్వాత దేశాన్ని అస్థిరపరిచే చర్యలు మొదలవుతాయి. బాబ్రీ మసీదు తరహా మార్గంలోనే మళ్లీ మనం వెళ్తున్నాం. బాబ్రీ మసీదు పై తీర్పు ఇచ్చిన సమయంలోనే నేను ప్రతి ఒక్కరిని హెచ్చరించాను. విశ్వాసం ప్రాతిపదికన ఇచ్చిన ఆ తీర్పు..  దేశంలో సమస్యలను సృష్టిస్తుందని అప్పట్లో చెప్పాను’’ అని ఓవైసీ వ్యాఖ్యానించారు. 


హిందూ పక్షం పిటిషన్ ను సమర్ధించిన వారణాసి కోర్టు

జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి జిల్లా కోర్టు సోమవారం కీలక ఆదేశాలను వెలువరించింది. మసీదులోని దేవతా విగ్రహాలకు పూజలు నిర్వహించేలా ఆదేశించాలన్న హిందూ పక్షం పిటిషన్ ను సమర్ధించింది. దీంతో సెప్టెంబరు 22 నుంచి ఈ పిటిషన్ పై విచారణ చేపట్టనుంది. ఇదే సమయంలో జ్ఞానవాపి మసీదుకు చెందిన అంజుమన్ ఇంతెజామియా కమిటీ పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. హిందూ పక్షాల తరఫున లాయర్ విష్ణుశంకర్ జైన్ మాట్లాడుతూ.. ముస్లిం పక్షం పిటిషన్ ను కోర్టు తిరస్కరించిందని తెలిపారు. దేవతా విగ్రహాల నిత్య పూజలకు అనుమతించాలన్న దావా నిర్వహించదగినదని సింగిల్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ ఏకే విశ్వేశ్ పేర్కొన్నారని చెప్పారు. 

నేపథ్యంలోకి వెళ్తే.. 

ఇక  నేపథ్యంలోకి వెళ్తే..  మసీదు ప్రాంగణంలో విగ్రహాల విషయమై విచారణే అవసరం లేదని, దీనిపై కొంతమంది చేస్తున్న ఆరోపణలు సత్యదూరమని అంజుమన్ ఇంతెజామియా కమిటీ అఫిడవిట్ దాఖలు చేసింది. మసీదుకు సంబంధించిన స్థలం సహా మిగిలిన ఆస్తులు పూర్తిగా వక్ఫ్ బోర్డుకు చెందుతాయని పేర్కొంది. మరోవైపు మసీదు కాంప్లెక్స్ లోని హిందూ దేవతలను పూజించేందుకు అనుమతి కోరుతూ ఢిల్లీకి చెందిన ఐదుగురు మహిళలు పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక కమిటీ అక్కడ వీడియో సర్వే నిర్వహించింది. అయితే అది శివలింగం కాదని మసీద్ కమిటీ వాదిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరి, తిరిగి వారణాసికే చేరింది. వీడియో రికార్డింగ్ కు సంబంధించిన ఫుటేజీలు లీక్ కావడంతో ఈ కేసు చర్చనీయాంశంగా మారింది. ఈనేపథ్యంలో ఇవాళ వెలువడిన తీర్పు ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.  తాజా తీర్పు నేపథ్యంలో వారణాసిలో హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే144 సెక్షన్ విధించారు. తీర్పు తర్వాత ఎటువంటి అల్లర్లు జరక్కుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రశాంత పరిస్థితుల కోసం మతపెద్దలతో పోలీసులు ఇంతకుమునుపే సంప్రదింపులు జరిపారు.