మజ్లిస్​కు దమ్ముంటే 119 సీట్లలో పోటీ చేయాలి : బండి సంజయ్​

 మజ్లిస్​కు దమ్ముంటే 119 సీట్లలో పోటీ చేయాలి :  బండి సంజయ్​
  •  మజ్లిస్​కు దమ్ముంటే 119 సీట్లలో పోటీ చేయాలి
  • మా సత్తా ఏమిటో చూపిస్తం: బండి సంజయ్​
  • ఒవైసీ కండ్లలో ఆనందం కోసం కేసీఆర్​ మోకరిల్లుతుండు
  • బరాబర్ సెక్రటేరియెట్ డోమ్​లను కూల్చేస్తం..
  • తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా మారుస్తం
  • రాష్ట్రంలో రామరాజ్యం తీసుకొస్తామని వ్యాఖ్య
  • కార్వాన్​లో ఛత్రపతి శివాజీ శోభాయాత్ర

హైదరాబాద్ , వెలుగు:  మజ్లిస్​ పార్టీకి దమ్ముంటే రాష్ట్రంలోని 119 అసెంబ్లీ సీట్లలో పోటీ చేయాలని బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్​ సవాల్​ విసిరారు. తమ సత్తా ఏమిటో చూపిస్తామని, మజ్లిస్​కు డిపాజిట్​ రాకుండా చేస్తామన్నారు. ‘‘మజ్లిస్​ ఒంటరిగా వస్తదా?  బీఆర్ఎస్ , కాంగ్రెస్​ను వెంటేసుకొని వస్తదా.. రా..! బీజేపీ సింహం... సింగిల్​గా వస్తది” అని చెప్పారు. యువకులంతా 8 నెలలపాటు సమయమిస్తే... తెలంగాణలో రామ రాజ్యాన్ని తీసుకొచ్చే బాధ్యత బీజేపీ తీసుకుంటుందని ఆయన అన్నారు. ఆదివారం ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతిని పురస్కరించుకుని కార్వాన్​లో శివాజీ మహరాజ్ సేవాదళ్ ఆధ్వర్యంలో శోభా యాత్ర నిర్వహించారు. ఇందులో బండి సంజయ్ పాల్గొని మాట్లాడారు.

కలశం, మామిడి తోరణాలతో   సంస్కృతి ఉట్టిపడేలా ఉన్న సెక్రటేరియెట్​ను ఒవైసీ కండ్లలో ఆనందం చూసేందుకు కూల్చేసి కొత్త భవనం పేరుతో డోమ్ లను నిర్మించారని కేసీఆర్​పై మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే బరాబర్​ ఆ డోమ్ లను కూల్చి తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా మార్పులు చేస్తామన్నారు. ‘‘నేను ఏనాడూ ముస్లింలను, క్రైస్తవులను కించపర్చలేదు. 15 నిమిషాల టైమిస్తే హిందువులను నరికి చంపుతామంటే ఊరుకుందామా? మనం శివాజీ వారసులం. శివాజీ ఏనాడూ ఔరంగజేబు వద్ద తలవంచలేదు. తుల్జాభవానీకి మొక్కి కత్తి చేతపట్టి యుద్దం చేసి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాడు” అని సంజయ్​ తెలిపారు. “సీఎం  కేసీఆర్ ఔరంగజేబు ఆస్థానంలోని రాజామాన్ సింగ్ టైపు. తానే నిఖార్సయిన హిందువునని పూజలు చేస్తూ తన బూతు పత్రికలో ఫొటోలు వేయించుకుంటా రజాకార్ల వారసత్వ పార్టీ వద్దకు పోయి మోకరిల్లుతుండు. హిందుత్వాన్ని తాకట్టు పెడ్తుండు” అని దుయ్యబట్టారు. తెలంగాణలో మజ్లిస్ ను తరిమికొడతామని హెచ్చరించారు. ‘‘భాగ్య నగర్ యువకుల్లారా.. హిందువుల దమ్మేందో చూపించే టైమ్​ వచ్చింది. మజ్లిస్ పార్టీ పాతబస్తీలో తప్ప ఇంకెక్కడ ఎందుకు పోటీ చేయడం లేదు? భాగ్యనగర్ హిందువులంతా దీన్ని సవాల్​గా తీసుకొని మజ్లిస్​కు బుద్ధి చెప్పాలి. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో  చూపిన తెగువ, స్ఫూర్తితో పోరాడాలి” అని బండి సంజయ్​ అన్నారు.  

వరంగల్​ రైతు సురేంద్​కు భరోసా

హైదరాబాద్ లో నాగలిపట్టి ఫ్లెక్సీతో అర్ధనగ్నంగా 5 రోజులుగా  తిరుగుతున్న వరంగల్ జిల్లా పొనకల్ గ్రామ రైతు సురేందర్ ఆదివారం బండి సంజయ్​ను కలిసి తన సమస్యను వివరించారు. దొంగ స్టాంప్ పేపర్లు సృష్టించి అధికార పార్టీ నేతల అండతో తన భూమిని కబ్జా చేసి తనను చంపేందుకు కుట్ర చేస్తున్నవాళ్ల నుంచి కాపాడి న్యాయం చేయాలని ఆయన కోరారు.  ఐదురోజులుగా  సీఎం, మంత్రులు, డీజీపీని కలిసేందుకు ప్రగతి భవన్, డీజీపీ కార్యాలయం సహా మంత్రుల చాంబర్ల చుట్టూ తిరుగుతున్నానని చెప్పారు. స్పందించిన బండి సంజయ్.. ‘‘బాధపడొద్దు. నీకు అండగా ఉంటా. న్యాయం జరిగేలా కృషి  చేస్తా’’ అని భరోసా ఇచ్చారు. వెంటనే సదరు రైతు పక్షాన న్యాయ పోరాటం చేయాలంటూ లీగల్ టీమ్​కు బాధ్యతలు అప్పగించారు.