నితీశ్, మమతా బెనర్జీపై అసదుద్దీన్ ఫైర్

నితీశ్, మమతా బెనర్జీపై అసదుద్దీన్ ఫైర్

అహ్మదాబాద్: బీహార్ సీఎం నితీశ్ కుమార్, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లౌకికవాదుల్లా ఫోజు కొడుతున్నారని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. శనివారం గుజరాత్ లోని అహ్మదాబాద్ లో అసదుద్దీన్ ఓవైసీ బీహార్ సీఎం నితీశ్ కుమార్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ బీజేపీతో కలిసి ఉన్న సమయంలో నితీశ్ కుమార్ సీఎం అయ్యారు. గోద్రా అల్లర్ల ఘటన జరిగిన సమయంలో కూడా ఆయన బీజేపీతోనే ఉన్నారు. 2015లో బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. మళ్ళీ 2017లో బీజేపీతో కలిశారు. 2019 ఎన్నికల్లో నరేంద్ర మోదీ విజయం కోసం నితీశ్ కుమార్ పనిచేశారు. మళ్ళీ ఇప్పుడు బీజేపీని వీడారు. కాంగ్రెస్, ఆర్జేడీతో కలిసి మహాఘట్బంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు’’ అంటూ  విమర్శలు గుప్పించారు. 

నితీశ్ పాలనలో బీహార్ లో చిన్న పిల్లలకు కూడా రక్షణ లేకుండాపోయిందన్న అసదుద్దీన్... అల్లర్లకు పాల్పడ్డారంటూ ఇద్దరు బాలులను చేతులను తాళ్లతో కట్టి కోర్టులో హాజరుపరచడం దారుణమన్నారు. అసలైన దోషులను పట్టుకోకుండా... బీహార్ పోలీసులు ముస్లిం పిల్లలను టార్గెట్ చేశారని మండిపడ్డారు. అలాగే మమతా బెనర్జీ కూడా అప్పట్లో ఎన్డీఏలోనే ఉన్నారని, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ను ఆమె ఆ సమయంలో పొగిడారని విమర్శించారు. మైనారిటీల సంక్షేమం కోసం మాట్లాడినప్పుడల్లా తమపై కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతుంటారని ఆరోపించారు. తాము మాత్రమే లౌకికవాదుల్లా వ్యవహరిస్తుంటారని, కానీ ఎవరూ నిజమైన లౌకికవాదులో... ఎవరూ మతతత్వ వాదులో త్వరలోనే తెలుస్తుందన్నారు. దేశ ప్రజలు ఇదంతా గమనిస్తున్నారని చెప్పారు.