ఎంఐఎంకు దమ్ముంటే అన్ని చోట్ల పోటీ చేయాలి  : ఎంపీ బండి సంజయ్ 

ఎంఐఎంకు దమ్ముంటే అన్ని చోట్ల పోటీ చేయాలి  : ఎంపీ బండి సంజయ్ 

కరీంనగర్: ‘దారుస్సలాంలో కూర్చొని బీరాలు పలకడం కాదు.. నిజంగా మీకు దమ్ముంటే, మొగోళ్లయితే తెలంగాణ అంతటా పోటీ చేయాలి. బీఆర్ఎస్ ను సంకలేసుకుని వస్తారో.. కాంగ్రెస్ సహా గుంట నక్కల పార్టీలతో కలిసి పోటీ చేస్తారో చూద్దాం.. బీజేపీ సింహం. సింగిల్ గానే పోటీ చేస్తుంది. మీకు డిపాజిట్లు రాకుండా చేస్తాం’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఎంఐఎం నేతలకు సవాల్ విసిరారు. కరీంనగర్ జిల్లా పద్మానగర్ లో టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన బండి సంజయ్ వేద పండితుల ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  ప్రపంచ దేశాలకు శ్రీవెంకటేశ్వర స్వామిని చేరువ చేసేందుకు టీటీడీ ఆధ్వర్యంలో టెంపుల్స్ నిర్మిస్తున్నారని, కరీంనగర్ లోనూ స్వామివారి ఆలయాన్ని నిర్మించడం  చాలా సంతోషకరమని అన్నారు. ఇది కరీంనగర్ హిందువుల అదృష్టమని కొనియాడారు. టీటీడీకి రాజకీయాలతో సంబంధం లేదని,  టీటీడీ మొదటి నుంచి హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడంలో ఆధ్యాత్మికతను పెంపొందించడంలో ముందుందన్నారు. ఇలాంటి ఆలయాలను తెలంగాణవ్యాప్తంగా మరిన్ని నిర్మించాలని ఆకాంక్షించారు. 

ఓటు బ్యాంకుగా మార్చి నాశనం చేస్తున్నరు

అనంతరం అసదుద్దీన్ వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు బండి సంజయ్ ఘాటుగా స్పందించారు.  ‘బీఆర్ఎస్ కారు స్టీరింగ్​ఎంఐఎం పార్టీ చేతిలో ఉందని అసదుద్దీన్ కామెంట్స్ ను బట్టి అర్థమవుతున్నది. ఆ పార్టీకి హైదరాబాద్ లో తప్పా ఎక్కడా ఉనికి లేదు.  ఓటు బ్యాంకుగా మార్చి ముస్లింలను నాశనం చేస్తున్నరు. నిజంగా ముస్లింలపై ప్రేమ ఉంటే పాతబస్తీ ఎందుకు అభివృద్ధి కావడం లేదు? ముస్లింలకు ఉద్యోగాలు ఎందుకు రావడం లేదు? కనీసం ముస్లింలకు పాస్ పోర్ట్ కూడా ఎందుకు రావడం లేదు? దీనిపై ఎంఐఎం నాయకులు సమాధానం చెప్పాలి. ఒవైసీ ఎంతసేపు ఆస్తులను కాపాడుకోవడానికే తపిస్తున్నారు? వాళ్ల ఏడుపు వాళ్లు ఏడవాలి. కానీ బీఆర్ఎస్ ను గెలిపించాలని ఎంఐఎం పార్టీ పిలుపునిస్తున్నది. వీళ్లందరి లక్ష్యం బీజేపీని తెలంగాణలో అధికారంలోకి రాకుండా రావాలని అడ్డుకోవడమే. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ మోచేతి నీళ్లు తాగింది. టీడీపీ, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్లతో కలిసి ఉంది.’ అని సంజయ్ విమర్శించారు. 

-బీజేపీ సింహం.. సింగిల్ గా పోటీ చేస్తుంది 

‘15 నిమిషాలు టైమిస్తే హిందువులను నరికి చంపుతానన్న తన తమ్ముడి వ్యాఖ్యలకు ఒవైసీ జవాబు చెప్పాలి. ఒవైసీ హాస్పిటల్ లో పనిచేసే వ్యక్తే ఉగ్రవాదుల నాయకుడని, వాళ్లకు షెల్టర్ ఇస్తూ ఆర్దిక సాయం ఇచ్చే పార్టీ ఎంఐఎం. టెర్రరిస్టులకు బెయిల్ ఇవ్వాలని వాదించిన పార్టీ నీది. సొంతంగా బలపడకుండా ఇంకో పార్టీ బలపడాలని కోరుకునే పార్టీ మీది. ఏనాడైనా సొంతంగా పోటీ చేసి అధికారంలోకి రావాలని కోరుకుందా? మీరు నిజంగా ముస్లిం సమాజం కోసమే పనిచేస్తున్నారని భావిస్తే...తెలంగాణవ్యాప్తంగా పోటీ చేయాలి. బీఆర్ఎస్ ను సంకలో వేసుకుని వస్తావా? ఇతర పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకుని వస్తారా?.. రండి.... బీజేపీ సింహం లెక్క సింగిల్ గా పోటీ చేస్తది.’ అని బండి సవాల్ విసిరారు. 

మాది ఏక్ నిరంజన్ పార్టీ కాదు

శంషాబాద్ లోని ఓ వ్యాపారి అమిత్ షా కు ఇల్లు కట్టించారని, అమిత్ షా ఇకపై ఇక్కడే ఉంటారని ఎంఐఎం చేసిన ఆరోపణలను కొట్టిపారేసిన బండి సంజయ్.. ఆ విషయం ఒవైసీకే తెలియాలన్నారు. బహుశా ఆయనకు టెర్రరిస్టు సంస్థ ఏమైనా ఈ విషయం చెప్పిందేమోనన్నారు. ఆ ఇంటికి వస్తే పేల్చాలని చూస్తున్నరేమోనని, తమ పార్టీ అగ్రనేత సమాచారం తమకు తెలియకుండానే ఆయనకే తెలుస్తుందా? అంటూ ఎద్దేవా చేశారు. ప్రజా సంగ్రామ యాత్రపై మీడియా అడిగిన ప్రశ్నకు ‘బస్ యాత్ర, పాదయాత్రపై పార్టీలో అందరం కూర్చుని నిర్ణయం తీసుకుంటామే తప్ప ఏక్ నిరంజన్ పార్టీ కాదు’’అని పేర్కొన్నారు.