మనసుంటే చాలు.. మతంతో పనిలేదు.. ముస్లిం కుటుంబానికి ఎద్దు దానం..

మనసుంటే చాలు.. మతంతో పనిలేదు.. ముస్లిం కుటుంబానికి ఎద్దు దానం..

మంచి చేయాలంటే మనసుంటే చాలు మతమెందుకని నిరూపించారు చిలూకూరు బాలాజీ గుడి అర్చకుడు. మతంతో పనేముంది ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికని ప్రపంచానికి గొప్ప నీతిని చాటిచెప్పారు. ముస్లిం రైతు కుటుంబం ఆపదలో ఉంటే వారిని ఆదుకున్నారు. ఓ ఎద్దును దానం చేసి  మానవత్వం చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. 

రంగారెడ్డి జిల్లా చిలుకూరులోని బాలాజీ టెంపుల్ లో ప్రధాన అర్ఛకుడిగా పని చేస్తున్న  సీఎస్ రంగరాజన్ స్వామి అదే గ్రామానికి చెందిన ముస్లిం మతానికి చెందిన గౌసు అనే వ్యక్తి కుటుంబానికి ఓ ఎద్దును దానం ఇప్పించారు. ఇటివల కాలంలో గౌసు ఎద్దు విద్యుత్ షాక్కు గురై మృతి చెందింది. ఈ  క్రమంలోనే గౌసు వ్యవసాయ పనులు చేయడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కున్నాడు. 

గౌసు ఇబ్బందిని గ్రహించిన రంగరాజన్ స్వామి అతన్ని ఆదుకోవడానికి ఎవరైనా ముందుకు రావాలని కోరారు. దీంతో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామానికి చెందిన అంజయ్య అనే రైతు ముందుకు వచ్చి ఎద్దును దానం చేస్తానని చెప్పాడు. చెప్పినట్టుగానే చిలుకూరు వచ్చి గౌసు కుటుంబానికి ఓ ఎద్దును దానం చేశారు. 

ఈ సందర్భంగా రంగరాజన్ స్వామి మాట్లాడుతూ మానవత్వం మతాన్ని చూడదని తోటి వారికి సహాయం చేస్తూ జీవితాన్ని గడపమని ఆ భగవంతుడు ఆజ్ఞాపిస్తుంటాడని చెప్పారు.