
స్కూల్ ఎడ్యుకేషన్‌లో క్వాలిటీ కోసం కొత్త విధానం
గ్రేటర్ హైదరాబాద్‌లో 200 స్కూళ్ల ఎంపిక..
అందులో 100 బడుల్లో స్పెషల్ ప్రోగ్రాం
మిగతా 100 స్కూళ్లలో నార్మల్ గా తరగతులు
హైదరాబాద్, వెలుగు: స్కూల్ ఎడ్యుకేషన్‌లో క్వాలిటీ పెంచేందుకు పాఠశాల విద్యాశాఖ కొత్త విధానాన్ని ఎంచుకుంది. ‘మైండ్ స్పార్క్’ సంస్థ సహకారంతో ప్రయోగాత్మకంగా మైండ్ స్పార్క్ ప్రోగ్రాం నిర్వహించనుంది. ఇందుకోసం రాష్ట్రంలోని 200 స్కూళ్లను ఎంపిక చేసుకుంది. దీంట్లో వంద బడుల్లో ‘మైండ్ స్పార్క్’ ప్రోగ్రాం నిర్వహించి, మరో వంద బడులను నార్మల్‌గా తరగతులు నిర్వహిస్తూ పరిశీలించనుంది. ఈ రెండు కేటగిరీల స్కూళ్ల స్టూడెంట్స్‌కు ఈ విధానం ప్రారంభంలో, ఏడాది చివరలో పరీక్ష నిర్వహించి ఫలితాలను గమనించనుంది.
‘గ్రేటర్’ పరిధిలో..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 200 సర్కారీ హైస్కూళ్లను మైండ్ స్పార్క్ ప్రోగ్రాం కోసం ఇప్పటికే స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఎంపిక చేశారు. వీటిలో ఆరు నుంచి పదో తరగతి వరకు 47, 209 మంది ఉంటే, వారిలో 36,216 మంది స్టూడెంట్స్‌కు ఇప్పటికే బెస్ లైన్ టెస్ట్ పెట్టారు. స్టూడెంట్ల బేసిక్ నాలెడ్జ్‌ను తెలుసుకునేందుకు ఈ ఎగ్జామ్ పెట్టారు. మిగిలిన వారికీ నెలాఖరులోగా పూర్తి చేయనున్నారు. వచ్చేనెల మొదటివారం నుంచి ఈ కార్యక్రమం పూర్తిస్థాయిలో ప్రారంభం కానుంది. ఎంపిక చేసిన వంద స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రోగ్రాం నిర్వహణకు సుమారు రూ.10 కోట్లు ఖర్చు చేయనున్నారు.
నోబెల్ విజేత ‘అభిజిత్’ సంస్థ సహకారంతో..
ఈ కార్యక్రమాన్ని నిర్వహించే మైండ్ స్పార్క్ సంస్థ.. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న ‘జే-పాల్’ ఆర్గనైజేషన్ సహకారం తీసుకోనుంది. ఇటీవల ఆర్థిక శాస్త్రంలో నోబెల్ అవార్డు పొందిన అభిజిత్ బెనర్జీ, ఆయన సతీమణి ఈస్తర్ డఫ్లో.. జే-పాల్ సంస్థ వ్యవస్థాపకులు. అభిజిత్‌కు శిష్యుడైన కార్తీక్ మురళీధరన్.. వారితో కలిసి మైండ్ స్పార్క్ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయనున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించి మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లిష్ సబ్జెక్టుల కంటెంట్ 80 శాతం పూర్తయిందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయ్‌కుమార్ తెలిపారు. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయితే రానున్న రోజుల్లో అన్నిబడులకు దీన్ని విస్తరిస్తామని చెప్పారు.