గని ప్రమాదం: తీవ్రంగా శ్రమిస్తున్న రెస్క్యూ టీం

గని ప్రమాదం: తీవ్రంగా శ్రమిస్తున్న రెస్క్యూ టీం
  • సింగరేణి ఏఎల్‌‌పీ గనిలో ప్రమాదం.. 
  • బొగ్గు పెళ్లల కింద పడి ఇద్దరు ఆఫీసర్లు, ఇద్దరు ఉద్యోగుల గల్లంతు
  • గాయాలతో బయటపడిన మరో ముగ్గురు
  • రామగుండం ఏరియా ఆర్జీ-3 పరిధిలో విషాదం

గోదావరిఖని/కమాన్‌‌పూర్‌‌, వెలుగు :  పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలోని సింగరేణి ఆర్జీ 3 పరిధిలో ఉన్న అడ్రియాల లాంగ్‌‌వాల్‌‌ ప్రాజెక్ట్‌‌ (ఏఎల్‌‌పి) గనిలో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు యాక్సిడెంట్ జరిగింది. గనిలోని 86వ లెవెల్​లో 540 మీటర్ల లోతులో వెహికల్స్​ను పనిస్థలాలకు తీసుకెళ్లే మార్గంలో వారం క్రితం బొగ్గు కూలింది. దీన్ని మెషీన్లతో క్లియర్‌‌ చేస్తుండగా, 30 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పు, 5 మీటర్ల మందంతో మరోసారి బొగ్గు మీద పడింది. పనిని పర్యవేక్షిస్తున్న మేనేజర్‌‌ బ్రాహ్మాజీ బొగ్గు పడుతున్న విషయాన్ని గమనించి పరిగెత్తగా, అక్కడే ఉన్న ఏరియా సేప్టీ ఆఫీసర్‌‌ జయరాజ్‌‌, అసిస్టెంట్‌‌ మేనేజర్‌‌ తేజావత్‌‌ చైతన్యతేజ, ఓవర్‌‌మెన్‌‌ పిల్లి నరేశ్‌‌, వెల్డింగ్‌‌ పనులు చేస్తున్న బదిలీ వర్కర్‌‌ రవీందర్‌‌, ఫ్రంట్‌‌ బ్రేక్‌‌ లోడర్‌‌ (ఎఫ్‌‌బీఎల్‌‌) మెషీన్‌‌ ఆపరేటర్‌‌ జాడి వెంకటేశ్వర్లు, హెల్పర్‌‌గా పనిచేసిన అవుట్‌‌ సోర్సింగ్‌‌ (వీటీసీ) కాంట్రాక్టు కార్మికుడు తోట శ్రీకాంత్‌‌ బొగ్గు పెళ్లల కింద చిక్కుకుని గల్లంతయ్యారు.

ఘటన జరిగిన ప్రాంతానికి 20 మీటర్ల దూరంలో డ్యూటీ చేస్తున్న ఎరుకుల వీరయ్య అనే కార్మికుడు బొగ్గు కింద పడ్డప్పుడు వచ్చిన గాలి ఒత్తిడికి తానున్న చోటు నుంచి కొంతదూరం వెళ్లి కిందపడ్డాడు. దీంతో ఆయనకు తొంటి భాగంలో స్వల్ప గాయాలు కాగా గోదావరిఖని సింగరేణి ఏరియా హాస్పిటల్‌‌లో ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటున్నాడు. అలాగే ఎఫ్‌‌బీఎల్‌‌ మెషీన్‌ ఆపరేటర్‌‌ కూర్చునే కుర్చీ‌పై ఇనుప జాలి ఉండడంతో పైనుంచి బొగ్గు దానిపైనే పడగా ఆపరేటర్ జాడి వెంకటేశ్వర్లు సేఫ్‌‌ అయ్యాడు. అతన్ని సింగరేణి రెస్క్యూ సిబ్బంది ఐదు గంటల పాటు కష్టపడి బయటకు తీసుకువచ్చారు. ఆయనకు ఎడమ కన్ను భాగంలో బోన్‌‌ విరిగి స్వల్ప గాయాలు గోదావరిఖని హాస్పిటల్‌‌కు తరలించారు. ఓవర్‌‌మెన్‌‌గా డ్యూటీ చేస్తున్న పిల్లి నరేశ్‌‌ ప్రాణాలతో ఉండగా, ఆయనకు గ్లూకోజ్‌‌ వాటర్‌‌ అందిస్తూ రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నారు.

ఇక ఆఫీసర్లయిన జయరాజ్‌‌, చైతన్య తేజ, ఎంప్లాయీస్‌‌ రవీందర్‌‌, తోట శ్రీకాంత్‌‌ జాడ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న సింగరేణి డైరెక్టర్లు ఎస్‌‌.చంద్రశేఖర్‌‌, ఎన్‌‌.బలరామ్‌‌, డి.సత్యనారాయణరావు హైదరాబాద్‌‌ నుంచి ప్రమాదం జరిగిన చోటికి వచ్చారు. వారి పర్యవేక్షణలో ఏరియా జనరల్‌‌ మేనేజర్ల సూచనలతో రెస్క్యూ ఆపరేషన్‌‌ కొనసాగిస్తున్నారు. పెద్ద మొత్తంలో పడిన బొగ్గును తొలగించడానికి చాలా సమయం పట్టనుండగా, గల్లంతైన వారి ఆచూకీ మంగళవారం తెలిసే అవకాశం ఉంది.

సింగరేణి యూనియన్ల లీడర్లు మిర్యాల రాజిరెడ్డి, నూనె కొమురయ్య, వి.సీతారామయ్య, జనక్‌‌ ప్రసాద్‌‌, యాదగిరి సత్తయ్య, తుమ్మల రాజారెడ్డి, రియాజ్‌‌ అహ్మద్‌‌, ఇతర నాయకులు గని వద్దకు చేరుకుని ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. రక్షణ చర్యల విషయంలో సింగరేణి మేనేజ్‌‌మెంట్‌‌ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మండిపడ్డారు. జడ్పీ చైర్మన్‌‌ పుట్ట మధు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌‌, జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, బీజేపీ స్టేట్‌‌ లీడర్‌‌ చందుపట్ల సునీల్‌‌ రెడ్డి, ఇతర లీడర్లు బాధితులను పరామర్శించారు. 
లాభాల గురించే ఆలోచనా : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు గని ప్రమాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సింగరేణి యాజమాన్యం తీరుపై మండిపడ్డారు. రోజూ బొగ్గు ఉత్పత్తి, లాభాల గురించి ఆలోచనే తప్ప , కార్మికుల సేఫ్టీకి చర్యలు తీసుకోవాలనే విషయాన్ని యాజమాన్యం పూర్తిగా విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరుపాలని డీజీఎంఎస్ ( డైరెక్టర్ ఆఫ్ జనరల్ మైన్స్ ) కు లెటర్​ రాసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ప్రమాదానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్​కాకుండా చూడాలని కోరారు. 
ప్రమాదం విచారకరం: వివేక్‌‌ వెంకటస్వామి
సింగరేణి అడ్రియాల మైన్‌‌లో సోమవారం జరిగిన యాక్సిడెంట్ విచారకరమని బీజేపీ నేషనల్‌‌ ఎగ్జిక్యూటివ్‌‌ కమిటీ మెంబర్‌‌, మాజీ ఎంపీ వివేక్‌‌ వెంకటస్వామి అన్నారు. గని ప్రమాదంలో చిక్కుకున్న మిగతా వారు క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలన్నారు.  సింగరేణి యాజమాన్యం లాభాలు గడిస్తున్నా కార్మికులకు భద్రత కల్పించడంలో విఫలమవుతోందన్నారు. సింగరేణి కార్మికుల సేఫ్టీ కోసం ఫండ్స్​కేటాయించడం లేదని ఆరోపించారు. ఫలితంగా గని ప్రమాదాల్లో కార్మికులు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.