- ఉత్తరాది జిల్లాల్లో మరింత చలి తీవ్రత
- అత్యల్పంగా ఆసిఫాబాద్ జిల్లాలో 8.2 డిగ్రీలు
- సిరిసిల్ల, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ 10 డిగ్రీలలోపే
- మరో ఐదు రోజుల పాటు రాష్ట్రంలో కోల్డ్ వేవ్ పరిస్థితులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి ఇగం పట్టింది. అన్ని జిల్లాల్లోనూ చలి తీవ్రత పెరిగింది. నాలుగైదు రోజుల్లోనే రాత్రి టెంపరేచర్లు రికార్డు స్థాయిలో పడిపోయాయి. 19 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల లోపే నమోదయ్యాయంటే.. చలి తీవ్రత ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా రాష్ట్రమంతటా రాత్రి ఉష్ణోగ్రతలు 15 లోపే నమోదవుతున్నాయి. కేవలం భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, ఖమ్మం, జోగులాంబ గద్వాల జిల్లాల్లోనే రాత్రి టెంపరేచర్లు 15 డిగ్రీలుగా రికార్డయ్యాయి. మిగతా అన్ని జిల్లాల్లోనూ ఆలోపే నమోదయ్యాయి. మరో ఐదు రోజుల పాటు రాష్ట్రంలో కోల్డ్ వేవ్ పరిస్థితులుంటాయని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వాతావరణంలో తేమ లేకపోవడం.. వేడిని గ్రహించేందుకు వీలుగా మేఘాలు ఏర్పడకపోవడంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా, నిరుడు ఇదే టైంకు రాష్ట్రంలోని ఓ ఐదారు జిల్లాలు మినహాయించి రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలకుపైగానే నమోదయ్యాయి. ఈ ఏడాది మాత్రం చలి తీవ్రత ఆరంభంలోనే ఎక్కువగా ఉంటున్నదని అధికారులు పేర్కొంటున్నారు.
ఉత్తర తెలంగాణలో 10 డిగ్రీలే
ఉత్తర తెలంగాణ జిల్లాలు చలి గుప్పిట్లో చిక్కుకున్నాయి. ఆ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలలోపే నమోదయ్యాయి. ముఖ్యంగా కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, రాజన్నసిరిసిల్ల, ఆదిలాబాద్ జిల్లాల్లో చాలా చోట్ల 10 డిగ్రీల లోపు రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్పంగా 8.2 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. అదే జిల్లాలోని లింగాపూర్‌లో 8.6, కెరమెరిలో 9.3, తిర్యాణిలో 9.5, సిర్పూర్లో 9.8, ధనోరాలో 10.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లా అంతటా 12 డిగ్రీల లోపే రాత్రి ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. ఇక, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రాంగిలో 9.1, మానాల్లో 9.8, బోయినపల్లిలో 10.6, గంభీరావుపేటలో 10.6, గాజసింగారంలో 10.9 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో 9.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అదే జిల్లా సోనాలలో 9.8, పొచ్చరలో 9.9 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. జిల్లాలోని నాలుగైదు చోట్ల 15 డిగ్రీల మేర రాత్రి ఉష్నోగ్రతలుండగా.. మిగతా అంతా 12 డిగ్రీలలోపే రికార్డ్ అయ్యాయి. కాగా, నిర్మల్, జగిత్యాల, సంగారెడ్డి, కామారెడ్డి, జిల్లాల్లోనూ రాత్రి ఉష్ణోగ్రతలు 10 నుంచి 11 మధ్య నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా జాంలో 10.1, ఖానాపూర్‌లో 10.9, జగిత్యాల జిల్లా పూడూరులో 10.4, తిరుమలాపూర్లో 10.5, మన్నెగూడెం, మల్లాపూర్‌లో 10.6, గోవిందారంలో 10.8, మద్దుట్లలో 10.9 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో 10.7, కామారెడ్డి జిల్లా గాంధారిలో 10.8 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాటితో పాటు కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేట, మంచిర్యాల, మెదక్, పెద్దపల్లి, రంగారెడ్డి, యాదాద్రి భువనగరి, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్జిల్లాల్లోనూ రాత్రి ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలలోపు రికార్డయ్యాయి.
హైదరాబాద్‌లో 10 డిగ్రీలకు పడిపోయే చాన్స్
హైదరాబాద్ సిటీలోనూ చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. అత్యల్పంగా హెచ్‌సీయూ వద్ద 11.8 డిగ్రీల మేర రాత్రి ఉష్ణోగ్రత రికార్డయింది. బీహెచ్ఈఎల్లో 12.5, రాజేంద్రనగర్ 12.9, గచ్చిబౌలిలో 13.3, వెస్ట్ మారేడుపల్లి 13.6, ఆదర్శ్‌నగర్ 13.7, శివరాంపల్లి 13.8, మచ్చబొల్లారం 14, కుత్బుల్లాపూర్‌లో 14 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. వచ్చే రెండు మూడు రోజుల్లో సిటీలో రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు పడిపోయే చాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
