కరీంనగర్, వెలుగు: కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, లేదంటే కాంగ్రెస్ కార్యకర్తల నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హెచ్చరించారు. కరీంనగర్‌లో పీఎంజే జ్యువెల్లరీ షాప్‌లో ఆదివారం జరిగిన ఘటనలో గాయపడ్డ బాధితులను కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో మంత్రి మంగళవారం పరామర్శించారు. అనంతరం ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ అంతర్రాష్ట్ర దొంగల ముఠా పక్కా ప్రణాళిక ప్రకారం చోరీ చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందని, ఈ కేసులో నిందితులను పట్టుకోవడానికి 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
బాధితుల పరామర్శ పేరుతో కరీంనగర్‌కు వచ్చిన కేటీఆర్, అంతర్రాష్ట్ర దొంగలకు సీఎంతో పరిచయం ఉందని మాట్లాడడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం మానుకొని కాళేశ్వరం కేసులో సీబీఐ ద్వారా కేసీఆర్‌కు నోటీసులు ఇప్పించాలని మంత్రి డిమాండ్ చేశారు.
కరీంనగర్ క్రైమ్, వెలుగు: సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ చేసిన అనుచిత, నిరాధార ఆరోపణలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, లీడర్లు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వడ్ల కొనుగోళ్లను స్పీడప్ చేయాలి
జగిత్యాల టౌన్: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి లక్ష్మణ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన రివ్యూ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ షరతుల వల్ల సేకరణలో కొంత ఆలస్యం జరిగిందని, ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని తెలిపారు. తూకం విషయంలో మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టవద్దన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొన్నారు.
