సబ్ ప్లాన్ నిధులతో గిరిజన గ్రామాల అభివృద్ధి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్

సబ్ ప్లాన్ నిధులతో గిరిజన గ్రామాల అభివృద్ధి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్

 

  • రూ.700 కోట్లు రిలీజ్ చేస్తూ ఉత్తర్వులు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
  • రోడ్లు, కరెంట్, ఇతర మౌలిక వసతులు కల్పిస్తం
  • త్వరలో టెండర్లు పిలుస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో సబ్ ప్లాన్ కింద బీటీ రోడ్లు, కరెంట్, ఇతర మౌలిక వసుతుల కల్పనకు ప్రభుత్వం నిధులు రిలీజ్ చేసింది. మొత్తం రూ.700 కోట్ల ఫండ్స్ కు పరిపాలన అనుమతులు ఇస్తూ జీవో జారీ చేసింది. మంగళవారం సెక్రటేరియెట్ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆ వివరాలు మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టిందని ఇందులో భాగంగా 429 గిరిజన గ్రామాలు, ఆవాసాలకు బీటీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. ఇటీవల వర్షాలకు రోడ్లు భారీగా దెబ్బతిన్నాయన్నారు. ఏటూరు నాగారం, ఉట్నూరు, భద్రాచలం ఐటీడీఏలతో పాటు ఎస్టీ నియోజకవర్గాల్లో సైతం మౌలిక వసతుల కల్పనకు ఈ నిధుల ఖర్చు చేస్తామన్నారు. త్వరలో ఐటీడీఏ పీవోలు, ఎస్సీ, ఎస్టీ శాఖల అధికారులతో సమావేశమైయి టెండర్లు పిలుస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో 417.53 కిమీ రోడ్లను రూ. 465.55 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. వీటితోపాటు అచ్చంపేట, ఆలేరు, ఆందోల్, బాల్కొండ, భువనగిరి, చేవెళ్ల, చొప్పదండి, దేవరకొండ, దుబ్బాక, గద్వాల, హుస్నాబాద్, హుజూర్ నగర్, ఇబ్రహీంపట్నం, నాగర్ కర్నూల్, నారాయణ ఖేడ్, నల్గొండ, నిజామాబాద్ రూరల్, పరిగి, పెద్దపల్లి, సంగారెడ్డి, షాద్ నగర్, సిరిసిల్ల, సూర్యాపేట, తాండూరు, తుంగతుర్తి, వేములవాడ, వికారాబాద్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో 244.75 కిమీ రోడ్లను రూ. 292.22 కోట్లతో అభివృధ్ది చేయనున్నట్లు పేర్కొన్నారు.

అవినీతి జరిగిందని కవిత ఒప్పుకున్నరు

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని స్వయంగా ఎమ్మెల్సీ కవిత అంగీకరించారని అడ్లూరి అన్నారు. సీబీఐ విచారణలో అన్ని విషయాలు బయటపడుతాయన్నారు. 2014కి ముందు నుంచి 2023 నవంబర్ వరకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత ఆస్తులు చూస్తేనే ఎంత అవినీతి జరిగిందో అర్థమవుతుందన్నారు. హరీశ్​రావు, సంతోష్ వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని కవిత 
వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమన్నారు.