హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. కేటీఆర్ తల కిందికి.. కాళ్లు పైకి పెట్టిన తెలంగాణలో బీఆర్ఎస్ ఇక అధికారంలోకి రాదన్నారు. మరో 20 ఏళ్లు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని విశ్వసించే పరిస్థితి లేదని అన్నారు.
శుక్రవారం (మే 22) జగిత్యాల జిల్లాలో కేంద్రంలో నిర్వహించిన ప్రజా పాలన సమీక్ష సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ.. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని.. లేదంటే రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని కాంగ్రెస్ కార్యకర్తలు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
కుటుంబ కలహాలతోనే కేటీఆర్ మతితప్పి మాట్లాడుతున్నారని విమర్శించారు. అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని ఏకవచనంతో మాట్లాడడం కేటీఆర్‌కు తగదని హితవు పలికారు. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏనాడు ఆయనను వ్యక్తిగతంగా మాట్లాడలేదన్నారు.
సీఎం రేవంత్‌పై అవాకులు చవాకులు పేలితే గొప్పొడి కావని చురకలంటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్లలో ఎస్సీ, బీసీ, మైనార్టీల సంక్షేమం కోసం ఏమి చేయలేదని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, బీసీ, మైనార్టీల బిల్లులు రూ. వెయ్యి కోట్లు చెల్లించిందన్నారు.
