ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహంపై వివాదం

ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహంపై వివాదం
  • ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహంపై వివాదం
  • శ్రీకృష్ణుడి గెటప్​లో ఏర్పాటుకు మంత్రి అజయ్ ప్రయత్నాలు
  • వ్యతిరేకిస్తున్న యాదవ సంఘాలు
  •     కమ్మ ఓట్ల కోసమే అని విమర్శలు
  •     ఈ నెల 28న విగ్రహ ఆవిష్కరణకు ఏర్పాట్లు

ఖమ్మం, వెలుగు : ఖమ్మం సిటీలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు వివాదాస్పదమవుతున్నది. లకారం ట్యాంక్ బండ్ వద్ద 54 అడుగుల ఎత్తయిన ఎన్టీఆర్ స్టాచ్యూని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఏర్పాటు చేయాలనుకున్నారు. తానా సభ్యులు, ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తల సహకారం అందించారు. రూ.4 కోట్లతో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మే 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా దీన్ని ఆవిష్కరించాలని నిర్ణయించారు. అయితే, ఈ విగ్రహం శ్రీకృష్ణుడి గెటప్ లో ఉండటం వివాదానికి కారణమవుతున్నది. తాము దేవుడిగా కొలిచే శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఎన్టీఆర్ రూపంలో ఏర్పాటు చేయడాన్ని యాదవ సంఘాలు తప్పుబడుతున్నాయి. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, శ్రీకృష్ణుడి గెటప్ లో మాత్రం వద్దని సూచిస్తున్నాయి. ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి టైంలో శ్రీకృష్ణుడికి నివాళులర్పించడం ఆ దేవుడిని అపవిత్రం చేయడమేనని యాదవ సంఘాల నేతలు చెబుతున్నారు. ఎన్టీఆర్ వేసిన ఏ గెటప్​లో అయినా విగ్రహాన్ని పెట్టుకోవచ్చని, శ్రీకృష్ణుడి వేషాధారణలో ఉన్నది మాత్రం వద్దని అంటున్నారు. విగ్రహ ఏర్పాటును నిలిపివేయాలంటూ హైదరాబాద్ నుంచి వచ్చిన యాదవ సంఘాల ప్రతినిధులు ఖమ్మం మున్సిపల్​ కమిషనర్​కు వినతిపత్రం అందజేశారు. 

ఖిల్లా ఏరియాలో ఏర్పాటుపైనా అభ్యంతరం 

శ్రీకృష్ణుడి గెటప్​లో ఎన్టీఆర్ విగ్రహం ఉండటంతో ముస్లింలు కూడా అభ్యంతరం చెబుతున్నారు. ఖిల్లా ఏరియాను ఆనుకొని ఉన్న లకారం ట్యాంక్ బండ్ మీద ఒక సామాజిక వర్గానికి చెందిన విగ్రహాన్ని అంత పెద్ద స్థాయిలో ఏర్పాటు చేయడం తమకు కూడా అభ్యంతరకరమేనని అంటున్నారు. మరోవైపు విగ్రహ ఆవిష్కరణ కోసం జూనియర్ ఎన్టీఆర్​ను మంత్రి పువ్వాడ అజయ్ ఆహ్వానించారు. 

సొంత కమ్యూనిటీలో పట్టు కోసమేనా?

ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై వివాదం మొదలైన తర్వాత ఖమ్మంలో సామాజిక వర్గాల అంశంపై చర్చ జరుగుతున్నది. మంత్రి అజయ్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో, సొంత కులంలో సానుకూలత కోసమే ఆయన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. గతంలో జిల్లా కమ్మ సంఘం ఎన్నికల సందర్భంగా మంత్రి అజయ్ వర్గంతో పాటు పలువురు కమ్మ కార్పొరేటర్లు సపోర్ట్ చేసిన వ్యక్తి ఎన్నికల్లో ఓడిపోవడాన్ని ప్రత్యర్థులు గుర్తు చేస్తున్నారు. అప్పటి నుంచి సొంత కమ్యూనిటీలో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న అజయ్, ఆ వ్యూహంలో భాగంగానే ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును ముందుకు తీసుకొచ్చారని విమర్శిస్తున్నారు