
ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో మెడికల్ కాలేజీ భూమిపూజలో పాల్గొన్న ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కీలక వ్యాఖ్యలు చేశారు. సుమారు 6 నెలల నుంచి ఖమ్మం ఎప్పుడొస్తారని వెంటపడి భూమిపూజ చేయించుకున్నారని అన్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో విద్యాపరంగా మెడికల్ కాలేజీ చాలా ముఖ్యమని.. ఎంత అవసరమో అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఇస్తామని అన్నారు. వైద్యం కోసం హైదరాబాద్ వరకు రాకుండా ఇక్కడే ఉండాలని మెడికల్ కాలేజీ కడుతున్నామని అన్నారు. ప్రతి జిల్లాలో మొబైల్ క్యాన్సర్ సెంటర్స్, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి 35 కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్ ఏర్పాటు చేస్తామని.. త్వరలో 80 ట్రామా సెంటర్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు మంత్రి రాజనర్సింహ.
వరంగల్ జిల్లాలో ఉచిత కాన్సర్ టెస్ట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. డయాలసిస్ పేషేంట్ల కోసం సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. ప్రతి ఆదివాసి మండలానికి రెండు అంబులెన్స్ లు ఇచ్చామని.. వందనం,కోడుమూరు ప్రాంతాల్లో నర్సింగ్ కలాశాల ఇవ్వబోతున్నామని అన్నారు. ఖమ్మం,వరంగల్,కరీంనగర్ లలో C సెక్షన్ ఆపరేషన్ లు బాగా జరుగుతున్నాయని, అవి తగ్గాలని అన్నారు.
ప్రజలు వైద్యుణ్ణి దేవుడిగా నమ్ముతారని.. ఆ నమ్మకాన్ని వమ్ము చేయొద్దని అన్నారు. త్వరలో ఏర్పాటు చేయబోయే ఒక్కో ట్రామా సెంటర్ కు 5 కోట్లు ఖర్చు పెట్టబోతున్నామని తెలిపారు. ఇప్పటిదాకా 8 వేల పోస్టులు భర్తీ చేసామని..త్వరలో మళ్లీ భర్తీ చేయబోతున్నామని అన్నారు రాజనర్సింహ. రాబోయే నోటిఫికేషన్లలో వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ ఉంటుందని.. వర్గీకరణ వల్ల ఎవరికీ నష్టం లేదని అన్నారు. ప్రజా అవసరాలను బట్టి వసతులు ఏర్పాటు చేస్తామని అన్నారు మంత్రి రాజనర్సింహ.