- మరో 7,267 ఉద్యోగాల నియామక ప్రక్రియ ఫైనల్‌కు: మంత్రి దామోదర
- త్వరలోనే కొత్త హెల్త్ పాలసీ తెస్తామని వెల్లడి
- 1,257 మందిల్యాబ్ టెక్నీషియన్లకునియామక పత్రాల అందజేత
హైదరాబాద్, వెలుగు: ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో ఒక్క హెల్త్ డిపార్ట్‌మెంట్ లోనే 9,572 పోస్టులను భర్తీ చేశామని, మరో 7,267 పోస్టుల భర్తీ ప్రక్రియ చివరి దశలో ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. మంగళవారం కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమంలో 1,257 మంది ల్యాబ్ టెక్నీషియన్లకు (గ్రేడ్-2) రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్‌తో కలిసి ఆయన నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ.. అత్యంత పారదర్శకంగా, వేగంగా నియామక ప్రక్రియను పూర్తి చేశామన్నారు. 2024 సెప్టెంబర్ 11న నోటిఫికేషన్ ఇస్తే.. 2025 నవంబర్ నాటికే ప్రాసెస్ పూర్తి చేశామన్నారు. మొత్తం 23,323 మంది పరీక్ష రాయగా, మెరిట్ ఆధారంగా 1,257 మందిని ఎంపిక చేశామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రెండేండ్లలో అన్ని శాఖల్లో కలిపి 70 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని గుర్తుచేశారు.
డాక్టర్లకు కళ్లు, చెవులు మీరే..
‘‘ఒకప్పుడు రోగి లక్షణాలను చూసి మందులు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు పక్కాగా రోగ నిర్ధారణ జరిగినంకనే ట్రీట్మెంట్ మొదలుపెడుతున్నారు. ల్యాబ్ టెక్నీషియన్లు ఇచ్చే రిపోర్టులే డాక్టర్లకు ప్రామాణికం. వైద్య వ్యవస్థకు మీరు కళ్లు, చెవుల్లాంటి వారు. మీ రిపోర్టుల్లో కచ్చితత్వం చాలా ముఖ్యం. ఎన్ఏబీఎల్ ప్రమాణాలతో సర్కారు ల్యాబ్స్‌ను తీర్చిదిద్దే బాధ్యత మీదే’’ అని మంత్రి దామోదర కొత్త ఉద్యోగులకు సూచించారు.
త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు...
ఆర్థిక శాఖ పర్మిషన్ ఉన్న మరో 996 పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని, అదనంగా మరో 2,344 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపామని మంత్రి స్పష్టం చేశారు. ఆరోగ్య రాష్ట్రంగా మార్చేందుకు త్వరలోనే నూతన హెల్త్ పాలసీని తీసుకురాబోతున్నామని వెల్లడించారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని, గాంధీలో ఉచిత ఐవీఎఫ్, జిల్లాల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు.
రిపోర్టులను బట్టే ట్రీట్‌మెంట్.: మంత్రి పొన్నం
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘‘మారుతున్న కాలానికి అనుగుణంగా వైద్య పరీక్షలు కీలకంగా మారాయి. పేషెంట్లకు ప్రేమతో సేవ చేయండి.. మీరు సానుకూలంగా మాట్లాడితే సగం రోగం అక్కడే నయమవుతుంది’’ అని సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చోంగ్తు, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
