న్యూఢిల్లీ: అవినీతి నిరోధక శాఖ చట్టంలోని సెక్షన్ 17ఏ రాజ్యాంగబద్ధతపై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ చట్టానికి 2018లో చేసిన సవరణ ద్వారా సెక్షన్ 17 ఏను చేర్చారు. దీని ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి ఆరోపణలకు సంబంధించి విచారణ జరపాలంటే సంబంధిత ఉన్నతాధికారి ముందస్తు అనుమతి తప్పనిసరి. దర్యాఫ్తు సంస్థల విజ్ఞప్తిపై మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని, ప్రత్యేక పరిస్థితుల్లో మరో నెల రోజులు పొడిగించవచ్చని సంబంధిత ఉన్నతాధికారులకు ఈ సెక్షన్ 17 ఏ సూచిస్తుంది. అయితే, లంచం తీసుకుంటూ పట్టుబడిన ఉద్యోగులను అరెస్టు చేసే విషయంలో మినహాయింపు కల్పించింది. ఈ సెక్షన్ 17 ఏ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను విచారించిన జస్టిస్ బీవీ నాగరత్న , జస్టిస్ కేవీ విశ్వనాథన్.. తీర్పులో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ సెక్షన్‌ను రాజ్యాంగ విరుద్ధమని, రద్దు చేయాలని జస్టిస్ బీవీ నాగరత్న చెప్పారు. ఇది అవినీతిపరులను కాపాడుతుందని, విచారణను అడ్డుకుంటుందని, చట్ట ఉద్దేశానికి వ్యతిరేకమని పేర్కొన్నారు.
అనవసర దర్యాప్తులను నిరోధిస్తుంది
బెంచ్‌లోని మరో జడ్జి జస్టిస్ కేవీ విశ్వనాథన్ ఈ సెక్షన్‌ను రాజ్యాంగబద్ధమని, నిజాయితీపరులను కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు. కానీ దీన్ని రీడ్ డౌన్ చేసి, లోక్‌పాల్ లేదా లోకాయుక్త ద్వారా అనుమతి తీసుకోవాలని చెప్పారు. దీన్ని రద్దు చేస్తే సమస్యను పరిష్కరించే క్రమంలో అవసరమైన, ఉపయోగకరమైన అంశాలను తొలగించినట్టు అవుతుందన్నారు. ఈ భిన్నమైన అభిప్రాయల నేపథ్యంలో కేసును చీఫ్ జస్టిస్ సూర్య కాంత్ ముందుకు పంపారు.
