- అత్యల్పంగా అమరచింత మున్సిపాలిటీలో 9,147 మంది
- మొత్తం 123 మున్సిపాలిటీల్లో 52.43 లక్షల మంది ఓటర్లు
- వీరిలో పురుషులు 25.62 లక్షలు, మహిళలు 26.80 లక్షలు
- ఓటర్ల తుది జాబితా ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం
హైదరాబాద్, వెలుగు: మున్సిపాలిటీల్లో ఓటర్ల సంఖ్య పరంగా 3,48,051 మందితో నిజామాబాద్మున్సిపల్కార్పొరేషన్మొదటి స్థానంలో నిలిచింది. 3,40,580 మంది ఓటర్లతో కరీంనగర్ కార్పొరేషన్ సెకండ్ ప్లేస్‌లో ఉంది. ఇక వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో అతి తక్కువగా 9,147 మంది ఓటర్లే ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించనున్న 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో ఓటర్ల మ్యాపింగ్ పూర్తయింది.
ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం అధికారికంగా ప్రకటించింది. మొత్తం 123 మున్సిపాలిటీల్లో 52.43 లక్షల మంది ఓటర్లు వెల్లడించింది. వీరిలో పురుషులు 25.62 లక్షలు, మహిళలు 26.80 లక్షలు ఉండగా.. ఇతర కేటగిరీలకు చెందినోళ్లు 640 మంది ఉన్నట్టు తెలిపింది. పురుషుల కంటే మహిళలు 1,17,645 మంది ఎక్కువగా ఉన్నట్టు పేర్కొంది.
కార్పొరేషన్లలోనే 26 శాతం ఓటర్లు..
రాష్ట్రంలో గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా 117 మున్సిపాలిటీల్లో 2,660, 6 కార్పొరేషన్లలో 366 వార్డులు ఉన్నట్టు ఇదివరకే ప్రకటించింది. ఇక 6 కార్పొరేషన్లలో కలిపి 13,86,074 మంది ఓటర్లు ఉన్నట్టు తాజాగా వెల్లడించింది. మిగతా 117 మున్సిపాలిటీల్లో 38,56,949 మంది ఓటర్లు ఉన్నట్టు తెలిపింది. అంటే ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీల్లో 26 శాతానికి పైగా ఓటర్లు కేవలం ఆరు కార్పొరేషన్లలోనే ఉన్నట్టు స్పష్టమవుతున్నది.
14 మున్సిపాలిటీల్లో 60 వేలకు పైగా..
నిజామాబాద్, కరీంనగర్ తర్వాత 1,97,841 మంది ఓటర్లతో మహబూబ్‌నగర్ కార్పొరేషన్ మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో రామగుండం (1,83,049), మంచిర్యాల (1,81,778), కొత్తగూడెం (1,34,775) ఉన్నాయి. మున్సిపాలిటీల పరంగా పరిశీలిస్తే ఆదిలాబాద్‌లో అత్యధికంగా 1,43,655 మంది ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాత నల్గొండలో 1,42,437 మంది, సూర్యాపేటలో 1,08,848 మంది ఉండగా... అతి తక్కువగా అమరచింత మున్సిపాలిటీలో 9,147 మంది, అలంపూర్‌లో 9,622, దేవరకద్రలో 10,070 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. 35 మున్సిపాలిటీల్లో 15 వేల లోపు ఓటర్లు, 42 మున్సిపాలిటీల్లో 15 వేల నుంచి 30 వేల లోపు, 23 మున్సిపాలిటీల్లో 30 వేల నుంచి 60 వేల లోపు, 14 మున్సిపాలిటీల్లో 60 వేల నుంచి లక్ష లోపు ఓటర్లు ఉన్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.
120 చోట్ల మహిళా ఓటర్లే ఎక్కువ..
ఎన్నికలు జరగనున్న 123 మున్సిపాలిటీలకు గాను 120 చోట్ల మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. నిజామాబాద్ మున్సిపల్కార్పొరేషన్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు 13 వేల మంది ఎక్కువగా ఉన్నారు. కేవలం సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్మున్సిపాలిటీలో మహిళల కంటే పురుషులు 1,605 మంది, భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 850 మంది, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో 36 మంది పురుషులు ఎక్కువగా ఉన్నారు. మిగతా అన్ని చోట్ల మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు.
