జోగిపేటలో ఘనంగా మంత్రి దామోదర జన్మదిన వేడుకలు

జోగిపేటలో ఘనంగా మంత్రి దామోదర జన్మదిన వేడుకలు

జోగిపేట, వెలుగు : రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. శుక్రవారం జోగిపేట పట్టణంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా అందోల్​లోని కస్తూర్భా బాలికల విద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేజీబీవీ, నర్సింగ్ విద్యార్థినులతో కలిసి ఆయన కేక్ కట్ చేసి వారితో కలిసి భోజనం చేశారు. 

మంత్రి స్వయంగా విద్యార్థినులకు భోజనం వడ్డించారు. పట్టణంలోని ఓ ఫంక్షన్​హాల్​లో పార్టీశ్రేణులు ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు మంత్రిని గజమాలతో సత్కరించారు. అభిమానుల సమక్షంలో కేక్​ కట్ చేశారు. ఈ సందర్భంగా బాలాజీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు, బ్లడ్ డొనేషన్ క్యాంపును మంత్రి ప్రారంభించారు. 

అనంతరం దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. ఆయా వేడుకల్లో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, మెదక్ డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, మెదక్, సంగారెడ్డి జిల్లాల గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు శ్రీమతి సుహాసినిరెడ్డి, అంజయ్య, మార్కెట్ కమిటీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, కొప్పుల లక్ష్మీశేషారెడ్డి, జిల్లా మార్క్​ఫెడ్ డైరెక్టర్ జగన్ మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, అన్ని మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.