- బడిబాటలో మంత్రి దామోదర్
రాయికోడ్, వెలుగు: విద్య, వైద్య రంగాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్‌రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌లోని జడ్పీహెచ్ఎస్లో బడి బాట కార్యక్రమానికి బుధవారం ఆయన హాజరయ్యారు. తొలుత పాఠశాల ఆవరణలో కలెక్టర్ వల్లూరి క్రాంతితో కలిసి మొక్కలు నాటారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతామని చెప్పారు.
ఇప్పటికే పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడానికి అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు ఏర్పాటు చేసి నిధులు కేటాయించామన్నారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాలలకు ప్రహరీ గోడ లేకపోవడంతో మందు బాబులకు అడ్డాగా మారిందని విద్యార్థుల తల్లిదండ్రులు మంత్రి దృష్టికి తెచ్చారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, అడిషినల్ కలెక్టర్ చంద్రశేఖర్, డీఈవో వెంకటేశ్వర్లు, డీఆర్డీవో జ్యోతి, బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి జగదీశ్వర్, ఎంపీపీ మొగులప్ప, జడ్పీటీసీ మల్లికార్జున్ పాటీల్, హెచ్ఎం అంజయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.