- మంత్రి దామోదర రాజనర్సింహ
సంగారెడ్డి, వెలుగు: మహిళా సాధికారత, పిల్లలకు నాణ్యమైన విద్య, పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మంగళవారం సంగారెడ్డి, జోగిపేటలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. పేదల ఆరోగ్యం కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోందన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తోందన్నారు. స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయడంలో భాగంగా వడ్డీ లేని రుణాలను ఇస్తున్నామని తెలిపారు.
వయోవృద్ధుల సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక బాధ్యత తీసుకుని వృద్ధుల డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేసిందని వివరించారు. టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలరెడ్డి, అడిషనల్ కలెక్టర్ పాండు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, మెప్మా పీడీ రామాచారి, డీఏవో శివప్రసాద్, ఆర్డీవో రాజేందర్, డాక్టర్ మౌనిక, తహసీల్దార్లు, లబ్ధిదారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
రూ.31.70 కోట్లతో..
సంగారెడ్డి మున్సిపాలిటీలో రూ.31.70 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు మంత్రి దామోదర శంకుస్థాపన చేశారు. హెచ్ఎండీ నిధులతో రూ.8 కోట్ల వ్యయంతో రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణ పనులకు, సీడీఎంఏ నిధులతో రాజీవ్ పార్క్ సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ పథకం కింద రూ.18.70 కోట్లతో రోడ్లు, మురుగు కాల్వలు, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పనులు చేపట్టనున్నారు. హెచ్ఎండీఏ నిధులతో రూ.2 కోట్ల వ్యయంతో రాజంపేట చౌరస్తా నుంచి ఫిల్టర్ బెడ్ వరకు సీసీ రోడ్డు నిర్మాణం, ఫిల్టర్ బెడ్ మరమ్మతు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
ఇంటిగ్రేటెడ్ ఆఫీసుల సముదాయం నిర్మాణానికి రూ.20 కోట్లు
జోగిపేట : జోగిపేటలో ఇంటిగ్రేటెడ్ ఆఫీసుల సముదాయం నిర్మాణానికి ప్రభుత్వం రూ.20 కోట్లు నిధులు మంజూరు చేస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. ఈ నిధులతో పంచాయతీ రాజ్, ఇంజనీరింగ్, ఎంపీడీఓ కార్యాలయం, ఆర్డబ్ల్యూఎస్, ఏఈఓ ఆఫీసులతో పాటు ఇతర భవనాలు నిర్మించనున్నారు. ఈ సముదాయం నిర్మాణం ద్వారా ప్రజలకు ఒకేచోట అన్ని ప్రభుత్వ శాఖల సేవలు అందుబాటులోకి రావడంతో పాటు పాలన మెరుగుపడనుంది.
