ఆస్ట్రేలియా హెల్త్ ప్రతినిధులతో మంత్రి దామోదర భేటీ

ఆస్ట్రేలియా హెల్త్ ప్రతినిధులతో మంత్రి దామోదర భేటీ

హైదరాబాద్​, వెలుగు: హైదరాబాద్ సిటీ మెడికల్ టూరిజంకు డెస్టినేషన్​గా మారిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. సోమవారం గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా డిపార్ట్ మెంట్ ఆఫ్ హెల్త్​కు చెందిన ఉన్నత స్థాయి అధికారుల బృందం హైదరాబాద్​లోని ట్రైడెంట్ హోటల్​లో మంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా తో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 

సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీ ద్వారా నాణ్యమైన వైద్య విద్యను అందిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి ఏటా 8,515 మంది మెడికల్ గ్రాడ్యుయేట్స్, 6,880  మంది నర్సింగ్ గ్రాడ్యుయేట్స్​తో పాటు 22,970 మంది పారా మెడికల్ కోర్సులను విజయవంతంగా పూర్తి చేస్తున్నారని మంత్రి వెల్లడించారు.