వరద ముప్పు శాశ్వత పరిష్కారంపై దృష్టి పెట్టాలి : ధనసరి అనసూయ

వరద ముప్పు శాశ్వత పరిష్కారంపై దృష్టి పెట్టాలి : ధనసరి అనసూయ
  • ములుగు కలెక్టరేట్​లో ఆఫీసర్లతో రివ్యూ

వెంకటాపూర్​ (రామప్ప)/ ములుగు, వెలుగు : జిల్లా లో ముంపు  సమస్యకు శాశ్వత పరిష్కారాలపై అధికారులు దృష్టి సారించాలని  మంత్రి ధనసరి అనసూయ  ఆదేశించారు.  సీజనల్​ వ్యాధులు రాకుండా అప్రమత్తంగా ఉండాలని, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గురువారం కలెక్టరేట్ లో  కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ డాక్టర్​ శబరీష్​ , ఐటీడీఏ  పీఓ చిత్రా మిశ్రా,  అడిషనల్​ కలెక్టర్లు పి.శ్రీజ, సీహెచ్ మహేందర్ జి, ఏఎస్పీ మహేశ్​ బి గీతే, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ తో కలిసి  వరద ముంపు నివారణకు చర్యలు, అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో  మంత్రి సీతక్క సమీక్షించారు.  వేసవి లో  తాగునీరు అందించడానికి  అధికారులు, సిబ్బంది  కృషి అభినందనీయమన్నారు.  

ఎన్నికల  వల్ల మూడు నెలలు పనులు పెండింగ్​లో పడ్డాయన్నారు. వర్షాకాలంలో  ప్రజలకు ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా  చర్యలు చేపట్టాలని సూచించారు.    సీజనల్ వ్యాధులు, అంటు వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని,  వ్యాధులు వ్యాపించకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు.  జిల్లాలో ప్రస్తుతం కొనసాగుతున్న వివిధ అభివృద్ధి  పనులను మంత్రి అడిగి తెలుసుకున్నారు.  వాటిని వెంటనే పూర్తి చేయాలని,  లేకుంటే కాంట్రాక్టర్లను  తొలగిస్తామని హెచ్చరించారు.  ఏటూరు నాగారం ఐటీడీఏ కార్యాలయంలో 24 గంటల  కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.  ఈ కార్యక్రమంలో ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, ఇరిగేషన్, నేషనల్ హైవే, పంచాయితీ రాజ్, ఆర్ అండ్ బీ, ఎలక్ట్రిసిటీ, ఇంజనీరింగ్ అధికారులు, 9మండలాల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. 

ఉచిత విద్య అందించడమే ప్రభుత్వ ధ్యేయం.. 

వెంకటాపూర్​ (రామప్ప), ములుగు:  రాష్ర్టంలో పేద విద్యార్థులందరికీ   ఉచిత నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సీతక్క అన్నారు.   బండారుపల్లి  మోడల్​ స్కూల్​ లో  కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి  విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు అందించారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు విద్యా బోధన జరుగుతోందని తెలిపారు.   19,645 మంది చిన్నారులకు  యూనిఫామ్​ అందించామని తెలిపారు.

 కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్ స్థానిక సంస్థలు పి.శ్రీజ, ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, ములుగు ఎంపీపీ గండ్ర కోట శ్రీదేవి, డీఈఓ పాణిని, డీఎస్పీ రవీందర్, మోడల్ పాఠశాల ప్రిన్సిపల్ శోభారాణి,  పాల్గొన్నారు. కాగా, ములుగులోని బస్టాండ్​ ఆవరణను పరిశీలించిన మంత్రి సీతక్క బస్టాండ్​ ఆధునీకరణపై అధికారులతో మాట్లాడారు.  ములుగు మండలం  ఇంచర్ల గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల గోదాం, కార్యాలయంను మంత్రి  సీతక్క ప్రారంభించారు.  

వెంకటాపూర్ (రామప్ప)  :   ప్రసాద్ స్కీం లో  భాగంగా మంజూరైన ఇంటర్ ప్రెటేషన్ సెంటర్ పనులను అక్టోబర్ లోపు పూర్తి చేయాలని,  రామప్ప దేవాలయం తూర్పు ద్వారం  పనులను పూర్తి చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు.  కలెక్టర్ ఇలా త్రిపాఠి, అడిషనల్ కలెక్టర్లు శ్రీజ మహేందర్  తో  కలిసి  రామప్పను సందర్శించారు.  ఈ కార్యక్రమంలో ఆర్డిఓ సత్యపాల్ రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.