ఉద్యమాలను ఆపే శక్తి ఎవరికీ లేదు

ఉద్యమాలను ఆపే శక్తి ఎవరికీ లేదు
  • చైతన్యాన్ని చంపితే ఉన్మాదం వస్తది
  • ప్రజలకు అవసరమయ్యేలా పథకాలు, చట్టాలు ఉండాలి
  • ఆఫీసర్ల పొరపాటు వల్ల భూసమస్యల పరిష్కారంలో తప్పిదాలు  

ముషీరాబాద్, వెలుగు: తెలంగాణ మట్టికి పోరాటం చేసే తత్వం ఉందని, కాబట్టి ఎవరికీ ఉద్యమాలను ఆపే శక్తి లేదని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రజలకు అవసరమైన విధంగా పథకాలు, చట్టాలు ఉండాలని.. ఎలక్షన్ ఓరియెంటెడ్‌గా ఉండకూడదని చెప్పారు. కులాలను బట్టి గౌరవించే దుర్మార్గ పరిస్థితిని చూస్తున్నామని, చైతన్యం చంపబడితే ఉన్మాదం వస్తుందని పేర్కొన్నారు. దొడ్డి కొమురయ్య ఇచ్చిన చైతన్యంతో ముందుకు పోయి సమసమాజం కోసం అంబేద్కర్ కన్న కలలను నిజం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అధికారుల పొరపాటు వల్ల భూ సమస్యల పరిష్కారంలో తప్పిదాలు జరుగుతున్నాయన్నారు. లక్షలాది ఎకరాల భూమిని పోరాటంతో సాధించుకున్న చరిత్ర ఉందని, పేదలు సాగు చేసుకుంటున్న భూములను వారికే ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య 94వ జయంతి వేడుకలు బీసీ సంఘాల ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్​ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి ఈటల రాజేందర్​ మాట్లాడుతూ.. అమరుల ఆశయాల సాధనకు పునరంకితం కావడమే సభల లక్ష్యమని చెప్పారు. పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ట్యాంక్​బండ్ మీద ఏర్పాటు చేయాలని తాను  ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తానన్నారు. ప్రజల ఆత్మ గౌరవానికి వెలకట్టే పరిస్థితి వచ్చిందని, సమాజంలో బలహీనవర్గాల వాళ్లం  వెనుకబడినవాళ్లుగా ఎందుకు ఉన్నామో అర్థం చేసుకోవాలని సూచించారు. బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్  మాట్లాడుతూ జాతి కోసం కొట్లాడిన మహావీరుల చరిత్ర మరుగునపడకుండా జీవితాంతం గుర్తు పెట్టుకోవాలన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాలకు దేవుళ్ల పేర్లు పెట్టడం మంచిదే కానీ కొన్ని జిల్లాలకు మహావీరుల పేర్లు పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌరీ సతీశ్‌ మాట్లాడుతూ.. దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి, చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలన్నారు. ఆయన వర్ధంతి, జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్​ చేశారు.