పేషంట్ ఆందోళనను బట్టి కాకుండా.. అవసరాన్ని బట్టి ట్రీట్మెంట్

పేషంట్ ఆందోళనను బట్టి కాకుండా.. అవసరాన్ని బట్టి ట్రీట్మెంట్

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటం.. మరోపక్క వ్యాక్సిన్లు అయిపోవడంతో ప్రజలలో తీవ్ర ఆందోళన మొదలైంది. దాంతో ప్రజల భయాలను తొలగిస్తూ.. ధైర్యం చెప్పేందుకు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ బీఆర్‌కే భవన్‌లో మీడియా సమావేశం పెట్టి మాట్లాడారు. రాష్ట్రంలో కేసులు ఎక్కువున్నా.. సీరియస్ కేసులు తక్కువగానే ఉన్నాయని ఆయన అన్నారు. 

‘దేశ, రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందుతున్నప్పుడు జనాలకు అప్పట్లో దాని గురించి పెద్దగా తెలియదు. అయినా జనాలు ప్రభుత్వానికి  సహకరించారు. కానీ, ఇప్పుడు తగ్గిందిలే అని ఊపిరి తీసుకునే లోపు.. మళ్లి సెకండ్ వేవ్ రూపంలో విస్తరిస్తోంది. మహారాష్ట్ర నుంచి ఎక్కువగా వస్తుంది. హైదరాబాద్ కాస్మోపలిటీన్ సిటీ కావడంతో.. హైదరాబాద్‌కు రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి. 45 ఏళ్ల పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని సీఎం అన్నారు. అన్ని డిపార్ట్మెంట్‌లలో 100 శాతం వ్యాక్సిన్ ఇవ్వాలంటే మాకు తొందరగా వ్యాక్సిన్ పంపాలని కేంద్ర మంత్రికి చెప్పాను. అదేవిధంగా 10 లక్షల వ్యాక్సిన్ అందించే సామర్థ్యం తమ సిబ్బందికి ఉందని తెలిపాను. ఈ రోజు రాత్రికి 2.7 లక్షల వ్యాక్సిన్ రాష్ట్రానికి వస్తుంది. వ్యాక్సిన్ సమస్య కేంద్రం త్వరగా పరిష్కరించాలి. ఆక్సిజన్ అవసరం ఎక్కువగా ఉంది. అందుకే కొరత లేకుండా చూస్తున్నాం. ఆక్సిజన్ ప్రొడక్షన్ కేంద్రం చేతుల్లో ఉంది. రోజుకు 260 టన్నుల వ్యాక్సిన్ అవసరం ఉంది. అది ఇంకా పెరగొచ్చు. ఇప్పటికైతే ఆక్సిజన్ కొరత లేదు’ అని ఆయన అన్నారు.

ఆందోళనను బట్టి కాకుండా.. అవసరాన్ని బట్టి ట్రీట్మెంట్ 
పేషంట్ ఆందోళనను బట్టి కాకుండా అవసరాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తామని మంత్రి ఈటల అన్నారు. ఆక్సిజన్ సాచురేషన్ బాగున్నా.. ఆక్సిజన్ కావాలంటున్నారని ఆయన అన్నారు. ‘కంపెనీలు రెమెడెసివిర్ ప్రొడక్షన్ తగ్గించాయి. ఇప్పుడు అవసరాన్ని బట్టి ప్రొడక్షన్ పెంచుతున్నాయి. సీఎం కేసీఆర్, కేటీఆర్, నేను కంపెనీలతో మాట్లాడాం. వ్యాక్సిన్లను డైరెక్ట్‌గా హాస్పిటల్‌కు ఇవ్వాలని చెప్పాం. దాన్ని పర్యవేక్షించేందుకు డ్రగ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్‌లను పెట్టాం. రేపటి నుంచి వ్యాక్సిన్లకు ఇబ్బంది ఉండదు. రాష్ట్రంలో 20 పడకల హాస్పిటల్స్‌కు కూడా పర్మిషన్ ఇచ్చాం  కాబట్టి బెడ్స్ కొరత ఉండదు. 5 శాతం పేషంట్లకు మాత్రమే హాస్పటల్‌లో ట్రీట్మెంట్ అవసరం. ప్రస్తుతం రాష్ట్రంలో 60 వేల బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. 24 గంటలూ అందరం కరోనా మీదే పనిచేస్తున్నాం. అవసరం అయితే మ్యాన్ పవర్ తీసుకోవాలని కూడా సూచించాం. కేసులు ఎక్కువగా ఉన్నా.. సీరియస్ కేసులు తక్కువే ఉన్నాయి. కేటీఆర్ మున్సిపల్ అధికారులతో రివ్యూ చేశారు. గతంలో లాగే అన్ని చర్యలు తీసుకుంటాం. ఈ రోజు నుంచి మీడియా సంయమనం పాటించాలి. డాక్టర్లు, నర్సులు లీవ్స్ పెట్టకుండా ప్రజలను కాపాడాలి’ అని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.