పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే మా లక్ష్యం: ఎర్రబెల్లి

పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే మా లక్ష్యం: ఎర్రబెల్లి

జనగామ జిల్లా : రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఆదివారం జనగామలో ఖరీఫ్ సీజను- 2019-20 వరి, పత్తి కొనుగోలుపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు హాజరైన మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ… పంటను అమ్ముకునే ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా  రైతు సమన్వయ సమితి సభ్యులు కీలకంగా వ్యవహరించాలని అన్నారు.

కొనుగోలుకు సంబంధించి.. గన్ని బ్యాగుల సరఫరా పకడ్బందీగా జరగాలని,  కొనుగోలు పూర్తి కాగానే గడువు లోపు చెల్లింపులు పూర్తయ్యేలా చూడాలన్నారు ఎర్రబెల్లి.  వర్షాలు కురిస్తే ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చెయ్యాలని సూచించారు.

దేవాదుల, చెక్ డ్యాంలు, మిషన్ కాకతీయతో జల వనరులు పెరిగి… జనగామ జిల్లా ఈసారి రికార్డు స్థాయిలో వరి ధాన్యం ఉత్పత్తి అయ్యిందని మంత్రి తెలిపారు. ఈసారి పత్తి సాగు విస్తీర్ణం, ఉత్పత్తి పెరిగాయని,  సీసీఐ(కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చెయ్యాలని అన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో సీసీఐ ప్రతినిధి కచ్చితంగా ఉండేలా సీసీఐ ఉన్నతాధికారులు నియామకం జరపాలన్నారు. తేమ లేకుండా పత్తిని మార్కెట్ కు తీసుకువచ్చేలా రైతులకు… అధికారులు అవగాహన కల్పించాలని చెప్పారు.  పత్తి కొనుగోలు నిబంధనలపై కరపత్రాలను ప్రతి ఊరికి పంపిణీ చెయ్యాలని,  మార్కెటింగ్, ఐకేపి సిబ్బంది, రైతు సమన్వయ సమితి సభ్యులు సమన్వయంతో పని చేయాలని చెప్పారు.

సీఎం కేసీఆర్ దయ వల్ల జనగామ జిల్లాకు ఈ ఏడాది తాగునీటికీ, సాగునీటికి ఇబ్బంది లేకుండా అయ్యిందన్నారు ఎర్రబెల్లి.  ధాన్యం కొనుగోలు కోసం ఎక్కువ ఖర్చు చేసేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమేనన్నారు. మిల్లర్లు, వ్యాపారులు, అధికారులు కలిసి పని చేసి రైతులకు మంచి ధర వచ్చేలా చూడాలని చెప్పారు.ఈ సదస్సుకు ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎంపీపీలు, జెడ్పిటిసి సభ్యులు హాజరయ్యారు.