తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడా : ఎర్రబెల్లి

తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడా : ఎర్రబెల్లి

జనగామ, వెలుగు: నారన్నా.. ఆర్టీసీ కార్మికులందరినీ డ్యూటీలో జాయిన్​ చేయించు.. ఇయ్యాల(మంగళవారం) లాస్ట్​ డేటు.. ఇట్లనే జిజ్జుకు పోతే ఇబ్బంది పడుతరు.. కేసీఆర్​ దగ్గరకి పోయి అడిగితే ఏదీ కాదనడు.. ఒక్క విలీనం అంశం తప్ప మిగిలిన కోరికల కోసం మీతో పాటు అందరం సీఎంతో మాట్లాడుదాం.. యూనియన్​ లీడర్లుగా కాంగ్రెస్, బీజేపోళ్ల మాయలబడి ఇబ్బంది పడుతున్నరు.. మీరైన జాయిన్​ కమ్మని పిలుపు నియ్యండ్రి.. అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణను ఉద్దేశించి పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు. జనగామలోని బతుకమ్మ కుంట సమీపంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు నల్లా నరసింహులు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఇదే వేదికపై ఉన్న నారాయణ తాను తెలంగాణ కోసం పోరాడానని, అప్పుడు ఎర్రబెల్లి సమైక్యవాద పార్టీలో ఉన్నాడని అన్నారు. ఇదేక్రమంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలపై మాట్లాడాలని సీపీఐ నాయకులు అడిగారు. దీంతో మంత్రి దయాకర్​రావు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులపై సీఎంకు సానుభూతి ఉందన్నారు. వారంతా డ్యూటీలో జాయిన్​ కావాలని పిలుపునిచ్చారు. ఉద్యమంలో తాను ముందుండి పోరాడానని ఎర్రబెల్లి అన్నారు. అప్పుడు టీడీపీలో ఉన్నప్పటికీ చంద్రబాబుతో రోజూ పంచాయతీకి దిగేదని, దీనికి సీపీఐ నారన్న, చాడ వెంకన్నలే సాక్ష్యమన్నారు. సీపీఐ నారాయణపై ఎన్ని కేసులు ఉన్నాయో తనపైనా అన్ని కేసులు ఉన్నాయని అన్నారు.