కేసీఆర్ కు గిరిజనులు రుణపడి ఉండాలి

కేసీఆర్ కు గిరిజనులు రుణపడి ఉండాలి

హైదరాబాద్: సీఎం కేసీఆర్ అందరి ‘బంధు’ అని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా రాష్ట్రంలోని గిరిజనులకు గిరిజన బంధు, 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మంత్రి తెలిపారు. మంగళవారం మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి ఎర్రబెల్లిని దయాకర్ రావును గిరిజన నేతలు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేసీఆర్ మాట తప్పే వ్యక్తి కాదని, త్వరలోనే గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని తెలిపారు. గిరిజ‌నుల‌కు 10శాతం రిజర్వేష‌న్ల కోసం ఆరేండ్ల కిందనే అసెంబ్లీ తీర్మానం చేసి పంపిస్తే... కేంద్రం ఆ బిల్లుని క‌నీసం ప‌ట్టించుకోలేద‌న్నారు. మొదట్లో అసలు ఆ బిల్లు తమ వద్దకు రాలేదని బుకాయించిందని, చివరికి వచ్చిందని కేంద్రం ఒప్పుకుందని చెప్పారు. దేశంలో కేసీఆర్ ను మించిన నాయకుడు లేడని మంత్రి తెలిపారు.

గిరిజనుల సంక్షేమం గురించి కేసీఆర్ పట్టించుకున్నంత మరెవరూ పట్టించుకోలేరని పేర్కొన్నారు. గిరిజనుల కోసం ప్రత్యేక గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి, గిరిజన ఆవాసాలను అభివృద్ధి చెందేలా చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. ఇప్పుడు 10 శాతం రిజర్వేషన్లు, గిరిజన బంధు ప్రకటనతో గిరిజనులపై తనకున్న ప్రేమను కేసీఆర్ మరోసారి చాటుకున్నారని కొనియాడారు. కేసీఆర్‌, టీఆర్ఎస్ పార్టీలకు రాష్ట్రంలోని గిరిజనులు రుణపడి ఉండాలని సూచించారు. సందర్భం వచ్చినప్పుడు ఆయన పట్ల తమ కృతజ్ఞతను చాటుకోవాలని కోరారు.