ప్రభుత్వం చేస్తున్న పనులను సర్పంచ్​లు గుర్తిస్తలేరు : ఎర్రబెల్లి 

ప్రభుత్వం చేస్తున్న పనులను సర్పంచ్​లు గుర్తిస్తలేరు : ఎర్రబెల్లి 

ప్రభుత్వం చేస్తున్న పనులను సర్పంచ్​లు గుర్తిస్తలేరు

కొంతమంది బీజేపీ ట్రాప్​లో పడ్డరు: ఎర్రబెల్లి 

హైదరాబాద్, వెలుగు : కొంతమంది సర్పంచులు ప్రభుత్వం చేస్తున్న పనులను గుర్తించడం లేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బీజేపీ ట్రాప్​లో పడి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘8 ఏండ్లలో పంచాయతీలకు వచ్చిన నిధులు.. అంతకుముందు 50 ఏండ్లలో కూడా రాలేదు. దీనిపై సర్పంచులకు అధికారులు అవగాహన కల్పించాలి’’ అని సూచించారు. శనివారం కలెక్టర్లు, అధికారులతో ఎర్రబెల్లి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల చేయకపోవడంతో కొంత ఇబ్బంది ఏర్పడిందని చెప్పారు. ‘‘రాష్ర్టానికి  కేంద్రం నుంచి  రూ.1,100 కోట్లు రావాల్సి ఉంది. కల్లాల కోసం రూ.151 కోట్లు ఉపాధి నిధులు ఖర్చు చేసినందుకు.. రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఆపింది. ఈ విషయాన్ని అధికారులు, సర్పంచులు అర్థం చేసుకోవాలి” అని అన్నారు. 

ప్రభుత్వ పథకాలపై గ్రామాల్లో బోర్డులు పెట్టండి.. 

ప్రభుత్వ పథకాలతో ప్రజలకు జరుగుతున్న లబ్ధిపై ప్రతి గ్రామంలో బోర్డులు పెట్టాలని అధికారులను ఎర్రబెల్లి ఆదేశించారు. ‘‘ప్రతి గ్రామంలో పింఛన్లు, రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ వంటి పథకాల లబ్ధిదారులు.. ఇప్పటి వరకు ఆ గ్రామానికి అందిన మొత్తం వివరాలతో బోర్డులు ఏర్పాటు చేయండి” అని చెప్పారు. పంచాయతీ బిల్డింగుల నిర్మాణ పనులు స్పీడప్ చేయాలని, గ్రామాల్లో వైకుంఠధామాలు, ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు వినియోగంలోకి తేవాలని సూచించారు. ప్రతి నియోజకవర్గానికి రూ.5 కోట్లతో పంచాయతీ రోడ్ల ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదేశించారు.