ఢిల్లీ తరహాలో రాష్ట్రంలో స్కూళ్ల అభివృద్ధి

ఢిల్లీ తరహాలో రాష్ట్రంలో స్కూళ్ల అభివృద్ధి
  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

వెలుగు నెట్ వర్క్: టీచర్ల సేవలు వెలకట్టలేనివని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. భారతదేశ మొట్టమొదటి ఉపరాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం టీచర్స్ డే నిర్వహించారు. జనగామలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై మాట్లాడారు. అన్ని రంగాలకు ఆద్యుడు గురువేనని, తల్లిదండ్రుల తర్వాత గురువుకే ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఉపాధ్యాయ వృత్తి చాలా గొప్పదని కొనియాడారు. ఢిల్లీ తరహాలో తెలంగాణలోని స్కూళ్లను అభివృద్ధి చేస్తామని చెప్పారు. విద్యారంగంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో రూ.7వేల కోట్లతో స్కూళ్లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. జనగామకు ఇప్పటికే మెడికల్ కాలేజీ మంజూరైందని, త్వరలోనే స్టేషన్ ఘన్​పూర్, పాలకుర్తిలలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను నిర్మిస్తామన్నారు. అనంతరం మంత్రి చదువుకున్న పర్వతగిరి హైస్కూల్​కు రూ.5లక్షల ఆర్థిక సాయం చేశారు.

కాగా, మహబూబాబాద్ పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొని, ఉత్తమ టీచర్లను సత్కరించారు. ఉపాధ్యాయులు దైవంతో సమానమని, వారి వల్లే విద్యార్థులు ఎదిగి సమాజానికి గొప్ప సేవ చేస్తారని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యతో పాటు జీవిత పాఠాలు కూడా బోధించాలన్నారు.  విద్యార్థులు టీచర్లు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినాలని, అప్పుడే చదువులో రాణించగలుగుతారని సూచించారు.