హైదరాబాద్ నుంచి వ‌చ్చే వాళ్లు ‌క్వారంటైన్‌లో ఉండాలి

హైదరాబాద్ నుంచి వ‌చ్చే వాళ్లు ‌క్వారంటైన్‌లో ఉండాలి

జనగామ : హైద‌రాబాద్ నుంచి వ‌చ్చే వారితో అప్రమత్తంగా ఉండాలని, వేరే ప్రాంతాల నుంచి వ‌చ్చిన వాళ్ళని హోం క్వారంటైన్ చేయాలని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. మంగ‌ళ‌వారం జనగామ జిల్లా పాలకుర్తి నియోజ‌క‌వ‌ర్గంలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. నియోజ‌క‌వ‌ర్గంలోని కొడ‌కండ్ల‌, దేవ‌రుప్పుల, పాల‌కుర్తి మండ‌లాల ప‌రిధిలోని ప‌లు అభివృద్ధి ప‌నుల‌పై స్థానిక అధికారులు, ప్రజాప్రతిప్రతినిధులు, రైతు సమన్వయ సమితి సభ్యులతో మంత్రి స‌మావేశ‌మ‌య్యారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు పాల‌కుర్తి రైతు వేదిక‌కు శంకుస్థాప‌న చేశారు.  6వ విడ‌త హ‌రిత హారంలో భాగంగా క్యాంపు కార్యాల‌యంలో, రైతు వేదిక స్థ‌లం వ‌ద్ద మొక్క‌లు నాటారు. హ‌రిత హారం ప‌థ‌కాన్ని విజ‌య‌వంతం చేయాలన్నారు. ప‌ల్లె ప్ర‌గ‌తిని నిరంత‌రం నిర్వహించాల‌ని, పారిశుద్ధ్య లోపాలుంటే… అధికారులు, ప్రజాప్రతినిధుల‌పై చ‌ర్యలు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్లు, చెక్ డ్యామ్ లు, ఆర్ అండ్ బీ, బీటీ, పిఎంజీఎస్ వై రోడ్ల ప‌నులను వేగ‌వంతం చేయాల‌ని అధికారుల‌కు సూచించారు. రెడీగా ఉన్న డ‌బుల్ బెడ్ రూం ఇండ్లకు త్వరలోనే ప్రారంభోత్సవాలు జ‌రుగుతాయ‌ని, ఇండ్లు పూర్తి చేయ‌ని కాంట్రాక్టర్లు బ్లాక్ లిస్టుల్లోకి వెళ‌తార‌ని చెప్పారు. క‌‌ల్లాలు, రైతు వేదిక‌ల ద‌ర‌ఖాస్తుల‌కు మ‌రో వారం రోజుల‌పాటు గ‌డ‌వు పెంచుతున్న‌ట్లు మంత్రి ప్ర‌క‌టించారు.

క‌రోనాపై మ‌రింత జాగ్రత్తలు అవ‌స‌రమ‌ని చెప్పిన మంత్రి.. ప్ర‌తీ ఒక్క‌రూ మాస్కులు ధ‌రించాల‌ని, స్వీయ నియంత్ర‌ణ‌, ప‌రిశుభ్ర‌త‌, ప‌రిస‌రాల పారిశుద్ధ్యం పాటించాల‌ని చెప్పారు. ప్ర‌జ‌ల‌ను భాగ‌స్వాముల‌ను చేస్తూ, అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు క‌రోనా క‌ట్ట‌డికి పాటుప‌డాల‌ని సూచించారు.