పొలిటికల్ మైలేజ్ కోసమే బీజేపీ ప్రయత్నం

పొలిటికల్ మైలేజ్ కోసమే బీజేపీ ప్రయత్నం

హైదరాబాద్, వెలుగు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సొంత ఇమేజ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తారే తప్ప.. పార్టీ కోసం పని చేయరని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రేవంత్ ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ అధికారంలోకి రాదని కామెంట్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో చిట్​చాట్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు అవకాశం ఉన్నా సరిగ్గా పని చేయడం లేదని, దాన్నే బీజేపీ అవకాశంగా తీసుకుంటోందని ఎర్రబెల్లి అన్నారు. రాష్ట్రంలో పొలిటికల్​మైలేజ్​కోసం బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు. ‘‘రాష్ట్ర సర్కార్ పల్లె ప్రగతి ప్రోగ్రామ్ చేపడితే, అదే టైమ్​లో కేంద్రం ఉపాధి నిధుల ఖర్చుపై తనిఖీలు చేపట్టింది. దీంతో ఆరు జిల్లాల్లో ఆఫీసర్లు పల్లె ప్రగతిలో పాల్గొనలేదు. సర్పంచ్​లను ప్రభుత్వంపై ఉసిలిగొల్పింది కూడా బీజేపీనే. సర్పంచ్ లు కానీ వారు కూడా సర్పంచ్ ల సంఘం అధ్యక్షులమంటూ హడావిడి చేశారు. బీజేపీ నేతలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతమైంది. అసలు సర్పంచ్ లు పల్లె ప్రగతిని వ్యతిరేకించనే లేదు” అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపాధి నిధులు రూ.800 కోట్లు రావాల్సి ఉందని చెప్పారు. బీజేపీ నేతలు మూర్ఖులని, వాళ్లు ప్రాంతీయ పార్టీలను చీల్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మహారాష్ట్ర లో అదే జరుగుతోందన్నారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల వాళ్లు.. వాళ్లను వాళ్లు కాపాడుకోవడం కోసమే పని చేస్తున్నారన్నారు. ఇటీవలి సర్వేల్లో అన్ని టీఆర్​ఎస్​కే అనుకూలంగా ఉన్నాయన్నారు.

పల్లె ప్రగతిలో దృష్టికొచ్చిన సమస్యలు పరిష్కరించండి

పల్లె ప్రగతిలో దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు.  బుధవారం ఆయా శాఖ‌ల‌ ఉన్నతాధికారుల‌తో  మంత్రి రివ్యూ చేపట్టారు. ప‌ల్లె ప్రగ‌తితోపాటు, ఇటీవల చేపట్టిన ప‌నుల పురోగ‌తిపై ఆరా తీశారు. కొత్త సీసీ  రోడ్లు, గ్రామ పంచాయ‌తీ భ‌వ‌నాల నిర్మాణాలను మొద‌లు పెట్టాలని అధికారులను ఆదేశించారు. స్త్రీ నిధి రుణాల ద్వారా ఇండ్లకు సోలార్ ఏర్పాటు చేయాలని.. అందు కోసం జిల్లాకు వెయ్యి మంది మ‌హిళా ల‌బ్ధిదారుల చొప్పున ఎంపిక చేయాలన్నారు. మ‌హిళా గ్రూపుల‌కు కుట్టు శిక్షణ ట్రైనింగ్ ఇవ్వాలని తెలిపారు. డ్వాక్రా గ్రూపుల ఉత్పత్తుల‌ను విక్రయించడానికి ఫ్లిక్ కార్ట్ తో  ఒప్పందం చేసుకోవాలని సూచించారు. స్త్రీ నిధి వేత‌న పెంపు ప్రతిపాద‌న‌లు సిద్ధం చేయాలన్నారు.